నవభారత నిర్మాణంలో యువత కీలకం
ABN, First Publish Date - 2022-10-11T04:55:51+05:30
నవ భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని
- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
శంషాబాద్‌రూరల్, అక్టోబరు 10: నవ భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌లో సోమవారం కుట్టుమిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. కొన్నినెలలుగా స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ విభాగాల్లో విద్యార్థులు శిక్షణ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు స్వామీ వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఇష్టపడి, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సూచించారు. ఒక్క పూట అన్నం పెట్టడం కాదు, దానిని సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించేందుకు నైపుణ్య శిక్షణను స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తోందని అభినందించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రభుత్వ సాయం పొందకుండా విదేశాల నుంచి ఏవిధమైన నిధులు తీసుకోకుండా స్వర్ణభారత్ ట్రస్టు సేవలను విస్తరించడానికి ఎంతోమంది మిత్రుల సహకారం ఉందన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థాయికి చేరినా తల్లిదండ్రులు, జన్మభూమి, మాతృదేశం, మాతృభాష, చదువు చెప్పిన గురువును గుర్తుపెట్టుకోవాలని సూచించారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ తీసుకున్న మహిళలు, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పాటల రచయిత శ్రీరామ్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-11T04:55:51+05:30 IST