ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ పంచాయతీ జరిగేనా?

ABN, First Publish Date - 2022-12-15T23:55:18+05:30

స్థానిక సంస్థల్లో ఖాళీగా అయిన పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టత లేకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఖాళీగా ఉన్న 354 స్థానిక సంస్థల పదవులు

ఖాళీ అయి ఏడాదిన్నర గడిచినా ఉపఎన్నికల ఊసే లేదు!

పదవి ఖాళీ అయిన 6నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాలి

ఉనఎన్నికల దిశగా చర్యలు తీసుకోని ప్రభుత్వం

గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే బైపోల్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం

ఎలక్షన్‌ నిర్వహిస్తారో లేదో తెలియక నీరుగారుతున్న ఆశావహులు

ఏదైనా కారణాలతో స్థానిక సంస్థల్లో పదవి ఖాళీ అయితే నిబంధనల మేరకు ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాలి. అయితే రాష్ట్రంలో పంచాయతీలు, పరిషత్‌లలో కొన్ని కారణాలతో పదవులు ఖాళీ అయి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. జిల్లాలోనూ ఖాళీ పదవులు సంఖ్య వందల్లో ఉంది. ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు తదితర ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిచేసింది. ప్రభుత్వ సూచనలు రావడమే తరువాయి.. ఉపఎన్నికలు పెట్టాలని సిద్ధంగా ఉంది. ఏడాది సమయంలోగా అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రభుత్వం స్థానిక మినీ సంగ్రామానికి ఇప్పట్లో మొగ్గు చూపేలా కన్పించడం లేదు. ఎన్నికలు పెడతారా? లేదా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

వికారాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల్లో ఖాళీగా అయిన పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టత లేకుండా పోయింది. వేర్వేరు కారణాలతో గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, ఇతర స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు నెలల లోపు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఎన్నికలు వాయిదాపడుతూ వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి మూడు, నాగుగేళ్లవుతున్న తరుణంలో ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన తరువాతనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇస్తుంది. గతంలో పదవుల్లో ఉన్న వారు కొందరు మృతి చెందగా, మరి కొందరు పదవులకు రాజీనామా చేశారు. అదే విధంగా ఎన్నికల్లో తాము చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించని కొందరిపై ఎన్నికల సంఘం పదవులకు అనర్హత వేటు వేసింది. అలాగే కొన్నిచోట్ల ఎన్నికల సమయంలో నామినేషన్లు రాకపోవడం, వివిధ కారణాలతో ఎన్నికల సంఘమే కొన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించని పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గత ఏప్రిల్‌ నెలలోనే కసరత్తు ప్రారంభించారు. మార్పులు, చేర్పులు, అభ్యంతరాల ప్రక్రియ పూర్తిచేసి గత ఏప్రిల్‌ నెలాఖరులోగా తుది ఓటర్ల జాబితా సిద్ధం చేశారు.

ఏడాదిన్నరగా ఇన్‌చార్జిలే!

స్థానిక సంస్థల్లో పదవులకు ఖాళీలు ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై స్పష్టత లేదు. ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీ స్తున్నారు. ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వార్డులు, పంచాయతీలు, పరిషత్‌ల ప్రాదేశిక స్థానాల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియనూ పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికల నిర్వహణ అంశంపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందనా రాలేదు. గతంలో ఎన్నికలు నిర్వహణకు పూర్తి కసరత్తు చేసి సిద్ధం చేసినా కరోనా ప్రబలుతుందని వాయిదా వేశారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఏ కారణంగానో ఉపఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనేది సందేహాస్పదంగా మారింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల గడువు సైతం ఏడాది లోపే ఉంది. ఈ తరు ణంలో స్థానిక సంస్థలకు ఉపఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్ష పార్టీల అనుకూలురు గెలిచే చోట్ల తమకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రావనే ఉద్దేశం కూడా పాలకపక్షంలో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పదవులు ఖాళీ అయ్యాయిక్కడే..

జిల్లాలో స్థానిక సంస్థల్లో 9 ఎంపీటీసీ, 9 సర్పంచ్‌, 335 వార్డు సభ్యులు, ఒక మునిసిపల్‌ వార్డు కౌన్సిలర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదుగురు ఎంపీటీసీలు మృతి చెందాగా.. నలుగురిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఖాళీ స్థానాల సంఖ్య 9కి చేరింది. ఖాళీగా అయిన ఎంపీటీసీ స్థానాల్లో నవాబుపేట మండలంలో మమ్మదాన్‌పల్లి, ధారూరు మండలంలో ధారూరు, అల్లీపూర్‌, పీసీఎం తండా, నాగసమందర్‌, బషీరాబాద్‌ మండలం దామర్‌చెడ్‌, దోమ మండలం బుద్లాపూర్‌, కులకచర్ల మండలం కుసుమసముద్రం, కొడంగల్‌ మండలం పెద్ద నందిగామ స్థానాలు ఉన్నాయి. ఖాళీ అయిన సర్పచ్‌ స్థానాల్లో బషీరాబాద్‌ మండలంలో నవాల్గ, దౌల్తాబాద్‌ మండలం ఇందాపూర్‌, పెద్దేముల్‌ మండలం మారేపల్లితండా, పూడూరు మండలం కొత్తపల్లి, యాలాల్‌ మండలం రాళ్లగడ్డతండా, తిమ్మాయిపల్లి, కులకచర్ల మండలం అనంతసాగర్‌, పరిగి మండలం కాడ్లాపూర్‌, వికారాబాద్‌ మండలం నారాయణపూర్‌ పంచాయతీలు ఉన్నాయి. ఖాళీగా 335వార్డు సభ్యుల పదవులు ఉన్నాయి. వీటిలో అనర్హత వేటుతో ఖాళీ అయినవి 235 ఉన్నాయి. 71మంది వార్డు మెంబర్లు మృతిచెందారు. 18మంది పదవులకు రాజీనామా చేశారు. కాగా జిల్లాలో 3 వార్డుల్లో గత ఎన్నికల సమయంలో నామినేషన్లు రాలేదు. నారాయణపూర్‌ పంచాయతీకి ఎన్నిక జరగకపోవడంతో అక్కడి సర్పంచ్‌తో పాటు 8వార్డులూ ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే వికారాబాద్‌ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్‌ ఆర్‌.నర్సిములు గుండెపోటుతో మృతిచెందడంతో ఈ కౌన్సిలర్‌ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవులకు ఏడాదైనా ఇంకా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో గ్రామాల్లో ఆశావహుల్లో నిరాశ తప్పడం లేదు.

Updated Date - 2022-12-15T23:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising