నిరుపయోగంగా డంపింగ్ యార్డులు
ABN, First Publish Date - 2022-04-20T03:38:46+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన
- కానరాని సేంద్రియ ఎరువులు, వానపాముల ఉత్పత్తి
- ప్రజాధనం దుర్వినియోగం
- పాత బావులు, గుంతల్లో చెత్త పారబోత
- పట్టించుకోని పంచాయతీ సిబ్బంది
యాచారం, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలనే సదుద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు. కానీ ఎక్కడా వినియోగంలో ఉన్నట్లు కనిపించడం లేదు. యాచారం మండల పరిధిలోని గ్రామాల్లో 24 డంపింగ్ యార్డులను నిర్మించారు. ఒక్కో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50లక్షలు ఖర్చు చేసింది. అయితే కేవలం గడ్డమలాయగూడెం, గునగల్ గ్రామాల్లో మాత్రమే డంపింగ్ యార్డులు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా అన్నిచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి.
డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీతోపాటు వానపాములను ఉత్పత్తి చేయాలని వీటిని నిర్మించారు. ఇక్కడ తయారైన ఎరువును రైతులకు విక్రయిస్తే పంచాయతీకి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ, చెత్తతో ఎరువులు తయారు చేస్తున్న ఘటనలు ఏ ఒక్క గ్రామంలో మచ్చుకైనా కనిపించడం లేదు. డంపింగ్ యార్డులకు చెత్తను తీసుకురాకుండా గ్రామాల సమీపంలోని పాత వ్యవసాయ బావులు, గుంతల్లో పడేస్తున్నారు. అయినా పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల డంపింగ్ యార్డులలో చెత్తతో సేంద్రియ ఎరువు తయారి, వానపాముల ఉత్పత్తి చేసే విధానం గురించి సిద్దిపేటకు చెందిన ఓ వ్యాపారి యాచారంలో శిక్షణ ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన డంపింగ్ యార్డులను వినియోగించుకోలేకపోతున్నారు. నజ్దిక్‌సింగారంలో కుంట అంచున డంపింగ్ యార్డు నిర్మించడంతో వానాకాలంలో అది పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. చిన్నతూండ్లలో గ్రామానికి కిలోమీటర్‌న్నర దూరంలో డంపింగ్ యార్డు నిర్మించడంతో అటువైపు కన్నెత్తి చూసేవారు లేకుండా పోయారు.
మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు
యాచారం మండలంలోని డంపింగ్ యార్డుల వద్ద మరుగుదొడ్లను నిర్మించారు. కానీ వాటిల్లో నీటి వసతి కల్పించడంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో కాలకృత్యాల తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు.
శ్మశాన వాటికల్లో సౌకర్యాలెక్కడ?
మండలం పరిధిలోని శ్మశాన వాటికలకు విధిగా విద్యుత్, నీటి వసతి కల్పించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కానీ కలెక్టర్ ఆదేశాలను కూడా పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు బేఖాతర్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చౌదర్‌పల్లి, ధర్మన్నగూడ, గున్‌గల్ తదితర 19 గ్రామాల్లోని వైకుంఠధామాలకు విద్యుత్ వసతి, మరో 15 గ్రామాల్లోని వైకుంఠధామాల్లో నీటి వసతి కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల పరిధిలోని డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకొచ్చి, శ్మశాన వాటికల్లో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలో వసతులు కల్పిస్తాం
గ్రామాల్లోని అన్ని శ్మశాన వాటికల్లో విద్యుత్, నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయమై ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు సూచించాను. నెల రోజుల్లో వసతులు కల్పించడం కోసం కృషి చేస్తాం.
- శ్రీలత, ఎంపీవో యాచారం
Updated Date - 2022-04-20T03:38:46+05:30 IST