ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం
ABN, First Publish Date - 2022-12-07T23:31:55+05:30
అన్నాచెల్లెళ్లిద్దరూ కలిసి బైక్‌పై పెట్రోల్ బంక్‌కు వెళ్తుండగా ఆర్టీసీ(అద్దె బస్సు) బస్సు ఢీకొట్టడంతో చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. అన్న కాలు, చేయి విరిగాయి.
బైక్‌పై అన్నాచెల్లెళ్లు వెళ్తుండగా ఘటన
చెల్లెలు మృతి, అన్న చేయి, కాలు విరగడంతో ఆస్పత్రికి తరలింపు
మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు
నాలుగు గంటల పాటు రాకపోకలు బంద్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఘటన
బషీరాబాద్, డిసెంబరు 7 : అన్నాచెల్లెళ్లిద్దరూ కలిసి బైక్‌పై పెట్రోల్ బంక్‌కు వెళ్తుండగా ఆర్టీసీ(అద్దె బస్సు) బస్సు ఢీకొట్టడంతో చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. అన్న కాలు, చేయి విరిగాయి. ఈ సంఘటన వికారాబాద్బషీరాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం నవాల్గ గ్రామానికి చెందిన కొత్త రాములు, అమృతమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్, కూతురు అనూషలు కలిసి పొలం పనుల కొరకు పెట్రోల్ తీసుకువచ్చేందుకు బైక్‌పై బషీరాబాద్ ప్రధాన మార్గంలోని పెట్రోల్ బంకుకు వెళ్లారు. ఈక్రమంలో రోడ్డు ఎడమవైపు నుంచి పెట్రోల్‌బంకు వైపుకు బైక్‌ను తిప్పుతుండగా తాండూరు నుంచి బషీరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి కింద పడిన అనూష(11) అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. అన్న శ్రీనివాస్ కాలు, చేయి విరిగి తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కుటంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిందండ్రులు, స్థానిక సర్పంచ్ లాలప్ప గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి తరలివచ్చారు. విద్యార్థిని దుర్మరణం చెందడం చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు చలించిపోయారు. కాగా, అనూష ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు తయారై.. అన్న వెంట సరదాగా బైక్‌పై వెళ్లడంతో కానరాని లోకాలకు వెళ్లిందని తల్లిందడ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం జరిగాక అక్కడే నిలిపిన ఆర్టీసీ బస్సుపై కొందరు రాళ్లు రువ్వడంతో ముందు అద్దాలు పగిలాయి. సమాచారం అందుకున్న తాండూరు రూరల్ సీఐ రాంబాబు, స్థానిక ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. సర్పంచ్ లాలప్ప, స్థానిక గ్రామపెద్ద శంకర్‌రెడ్డి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. పెట్రోల్ బంకు ప్రధాన రోడ్డు మార్గం పక్కన ఉండటంతో స్పీడ్ బ్రేకర్లు కూడా లేవని ఇరువైపుల నుంచి వేగంగా వాహనాలు వస్తూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నవాల్గ సర్పంచ్ లాలప్ప ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు రోడ్డుపైకి చేరి నినాదాలు చేశారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా కార్యదర్శి యు.రమేష్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ తదితరులు గ్రామస్తులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థిని కుటంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ డీఏం, పోలీసుల హామీతో రోడ్డుపై బైఠాయించిన వారందరు వెళ్లిపోయారు. అనంతరం మృతదేహాన్ని తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Updated Date - 2022-12-07T23:31:56+05:30 IST