దారికొచ్చారు
ABN, First Publish Date - 2022-08-05T04:40:34+05:30
ప్రభుత్వం కేటాయించిన శాఖల్లో చేరేందుకు నిరాకరించి
- కలెక్టర్ హామీతో మెత్తబడిన వీఆర్వోలు
- 230 మంది విధుల్లో చేరిక
- తెరవెనుక ఉద్యోగసంఘనేతలు
- 19 మందికి న్యాయస్థానం ‘స్టే’
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఆగస్టు 4) : ప్రభుత్వం కేటాయించిన శాఖల్లో చేరేందుకు నిరాకరించి ఆందోళన బాటపట్టిన వీఆర్వోలు ఎట్టకేలకు మెత్తబడ్డారు. వీఆర్వో వ్యవస్థను రద్దుచేసిన ప్రభుత్వం వీఆర్వోలందరినీ ఇతరశాఖలకు బదిలీ చేస్తూ 121జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర శాఖలకు బదిలీ చేసిన వీఆర్వోలను లాటరీ పద్ధతిలో 40శాఖల్లో సర్దుబాటు చేశారు. అయితే సర్కార్ నిర్ణయంపై భగ్గుమన్న వీఆర్వోలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ జీవో ప్రకారం పోస్టింగ్‌లు తీసుకోబోమని మొండికేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మొత్తం 274 మంది వీఆర్వోలకుగానూ తొలి రోజు కేవలం 40 మంది మాత్రమే పోస్టింగ్‌లు తీసుకున్నారు. మిగతావారు నిరాకరించారు. అయితే జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఉద్యోగ సంఘనేతలతో పలుమార్లు చర్చలు జరిపి వీఆర్వోలకు సర్వీస్ విషయంలో నష్టంలేకుండా తనవంతు ప్రయత్నిస్తానని, ఉద్యోగుల మనోగతాన్ని ప్రభుత్వానికి తెలియచేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో వీఆర్వోలు మొత్తబడ్డారు. గురువారం భారీసంఖ్యలో వచ్చి పోస్టింగ్‌లు తీసుకున్నారు. తెరవెనుక టీఎన్జీవో, ఉద్యోగసంఘాల నేతలు కూడా కీలక పాత్ర పోషించారు. ఉద్యోగులతో కలెక్టర్ అమయ్‌కుమార్‌తోపాటు జేసీ ప్రతీక్‌జైన్, డీఆర్వో హరిప్రియ పలుమార్లు చర్చలు జరిపారు. ఎట్టకేలకు దాదాపు వీఆర్వోలంతా తమకు కేటాయించిన విధుల్లో చేరేందుకు అంగీకరించారు. దీంతో మొత్తం 274మంది వీఆర్వోలకుగానూ 240మంది వరకు తమ కేటాయించిన శాఖల్లో పోస్టింగ్‌లు తీసుకున్నారు. ఇదిలాఉంటే నేరుగా నియామకాలు పొందిన 19మంది న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరిని మినహాయిస్తే 85శాతానికిపైగా తమకు కేటాయించిన విధుల్లో చేరిపోయారు. గురువారం అంతా సజావుగా సాగడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇంకా విధుల్లో చేరనివారు కూడా శుక్రవారం పోస్టింగ్‌లు తీసుకుంటారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.
Updated Date - 2022-08-05T04:40:34+05:30 IST