నిధులొచ్చాయ్!
ABN, First Publish Date - 2022-12-07T22:58:48+05:30
రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరమైన వసతులు కల్పించడం, వాటి ఆలనాపాలన చూసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.9 వేల చొప్పున ఐదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసి జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం ఖాతాలో జమ చేసింది.
జిల్లాలోని రైతు వేదికలకు రూ.44.55 లక్షలు విడుదల
ఒక్కో క్లస్టర్‌కు రూ.9 వేల చొప్పు కేటాయింపు
ఐదు నెలలకు సంబంధించిన నిధులు విడుదల
చాలా రోజుల తరువాత కరుణించిన ప్రభుత్వం
రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరమైన వసతులు కల్పించడం, వాటి ఆలనాపాలన చూసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.9 వేల చొప్పున ఐదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసి జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం ఖాతాలో జమ చేసింది. త్వరలో క్లస్టర్ల వారీగా నిధులను కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వికారాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఽరైతు వేదికల నిర్వహణకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నిర్మించిన రైతు వేదికల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు లేక, సరైన నిర్వహణ కరువై క్రమంగా ఆదరణ కోల్పోతున్న విషయం తెలిసిందే. రైతు వేదికల నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని చాలా కాలంగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నారు. రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరమైన వసతులు కల్పించి ఆలనాపాలన చూసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.9 వేల చొప్పున అయిదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసి జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం ఖాతాలో జమ చేసింది. త్వరలో క్లస్టర్ల వారీగా నిధులను కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చిన నిధులను రైతు వేదిక పేరిట స్థానిక బ్యాంకుల్లో ఖాతా ప్రారంభించిన అనంతరం ఆ ఖాతాల్లో వచ్చిన జమ చేయనున్నారు. ఈ నిధులను జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏఈవోలు ఖర్చు చేయనున్నారు.
నీటి వసతి లేక ఇక్కట్లు
రైతులు సాగు చేసే పంట పొలాలను క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో 99 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ఒక్కో క్లస్టర్ పరిధిలో ఐదు వేల ఎకరాల పంట పొలాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. బీరువా, కుర్చీలు, టేబుళ్లు, మైక్ సెట్ తదితర సామగ్రి సమకూర్చారు. కాగా, పలు రైతు వేదికల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర వసతులు లేక అక్కడకు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నుంచి తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా ఇంకా కొన్ని వేదికలకు నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతిలేక.. నీటి వసతి ఉన్న చోట నిర్వహణ కరువై నిరుపయోగంగా మారాయి. అంతే కాకుండా రైతు వేదికల ఆలనాపాలనా చూసేందుకు నిర్వహణ నిధులు కరవయ్యాయి. రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.2 వేల వంతున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రకటించింది. ప్రారంభంలో కొంత కాలం నిర్వహణ ఖర్చులు విడుదల చేసిన ప్రభుత్వం ఆ తరువాత నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక రైతు వేదికల నిర్వహణ భారంగా పరిణమించింది. ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేయడం కేంద్రాల నిర్వాహకులకు కొంత ఊరట కలిగించింది. వచ్చిన నిధులతో పరిసరాల పరిశుభ్రత, శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహనా సదస్సులు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.
రైతులకు అవగాహన కల్పించే వేదిక
పంటల సాగుకు సంబంధించి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. రోజూ ఉదయం రెండు గంటల పాటు ఏఈవోలు రైతులతో పంటల సాగుకు సంబంధించిన అంశాలు చర్చించి ఆ తరువాత క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. గ్రామాల్లో రైతులు పండించే పంటల సాగు ఎలా ఉందనేది క్షేత్రస్థాయిలో వారు పరిశీలించాల్సి ఉంటుంది. దుక్కి దున్నడం నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించేంత వరకు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలపై ఏఈవోలతో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
నిధులు ఎలా ఖర్చు చేయాలంటే
జిల్లాలో రైతు వేదికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.44.55 లక్షలు విడుదల చేసింది. ఒక్కో క్లస్టర్‌కు రూ.9 వేల వంతున అయిదు నెలలకు సంబంధించి రూ.45 వేలు విడుదల చేశారు. రైతు వేదికలకు కేటాయించిన ఈ నిధులను పారదర్శంగా ఖర్చు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు సంబంధించిన కార్యక్రమాలు రైతు వేదికలు కేంద్రంగా కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. విడుదల చేసిన నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలనేది వివరించింది. రైతు వేదిక శుభ్రం చేసే వారికి వేతనంగా రూ.3 వేలు, రైతు శిక్షణా శిబిరాల నిర్వహణకు రూ.2,500, విద్యుత్ ఛార్జీలకు రూ.1,000, స్టేషనరీ, జిరాక్స్‌లకు రూ.1,000, మినీ లైబ్రరీ, మరమ్మతులు తదితర పనులకు రూ.1,000, తాగునీటికి రూ.1,000 ఖర్చు చేయాలని సూచించింది.
Updated Date - 2022-12-07T22:58:50+05:30 IST