మత్స్యకారుల మదనం
ABN, First Publish Date - 2022-10-10T04:42:43+05:30
మత్స్యకారుల మదనం
- చేప పిల్లల పంపిణీలో ఇబ్బందులు
- నాణ్యత లేని, చిన్నసైజు పిల్లల సరఫరా
- చేపల్లో లోపిస్తున్న ఎదుగుదల
- గిట్టుబాటు కాక మత్స్యకారుల ఆందోళన
- జిల్లాలో 91లక్షల లక్ష్యానికి.. 30లక్షల చేప పిల్లల పంపిణీ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరిగా అమలు కాక ఉపాధిపై దెబ్బ పడుతోంది. చెరువు, కుంటల్లో ఎక్కువ నీరున్న సమయంలోనే చేప పిల్లలు వదలాల్సి ఉండగా వానాకాలం పూర్తయ్యే వరకు పోస్తున్నారు. అదీగాక సైజులో చిన్నగా, బలహీనంగా ఉన్న చేపపిల్లలను వదుళ్తుండడంతో చేపలు ఎదగక మత్స్యకారులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ సారి చెరువుల్లో 91లక్షల చేపపిల్లలను పోయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30లక్షలే వదిలారు.
మేడ్చల్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పంపిణీలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చెరువుల్లోకి నీరు చేరినా చాలా వాటిల్లో ఇంకా చేప పిల్లలు వదలకపోవడంతో మత్స్యకారు లు ఆందోళన చెందుతున్నారు. నీటి వనరుల్లో నీరు పుష్కలంగా ఉన్న సమయంలోనే చేపపిల్లలను వదిళ్తే అవి త్వరగా ఎదిగే అవకాశం ఉంది. అయితే వివిధ కారణాలతో అధికారులు చేపల పిల్లల పం పిణీలో జాప్యం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో 333 చెరువులు, కుంటలుండగా వాటిల్లో 91లక్షల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుం ది. అయితే ఇప్పటి వరకు 30లక్షల వరకు చేప పిల్లలను వదిలారు. చెరువులు, కుంటల్లో చేపలు పెంచి ఉపాధి పొందేందుకు ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసే కాంట్రాక్టర్లు నాణ్యమైన పి ల్లలను సరఫరా చేయకపోవడంతో పథకం అమలు ఆలస్యమైతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచీ మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా అందజేస్తోంది. చెరువుల్లో పెరిగిన చేపలను మత్స్యకారులు అమ్ముకొని ఉపాధి పొ ందుతున్నారు. చెరువులు, కుంటల్లో వేసే చేప పిల్లలు నిబంధనల మేరకు 82ఎం.ఎం నుంచి 70ఎం.ఎం సైజు ఉ ండాలి. అవి అయితేనే త్వరగా ఎదుగుతాయి. చేపపిల్లల పంపిణీకి ముగ్గురు టెండర్లు దక్కించుకున్నారు. వారు నిర్ధారిత సైజుల్లో చేపపిల్లలను సరఫరా చేయక వాటి విడుదల ఆలస్యమవుతోంది.
- చిన్న సైజు పిల్లల పంపిణీ
చెరువులు, కుంటల్లో మ త్స్యకార సొసైటీల సభ్యు లు, ఎంపీడీవో, మత్సశాఖ అధికారుల సమక్షంలో చేప పిల్లలను చెరువు, కుంటల్లో పోస్తున్నారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసే చేపపిల్లలు సొంత ఫిషరీస్ ఫామ్‌లో పెంచాల్సి ఉండగా కాంట్రాక్టర్లు ఆంధ్రలోని కైకలూరు, చేపల చెరువులుండే ప్రాంతాల నుంచి తెస్తున్నారు. ఉప్పు నీటిలో పెరిగిన, నాణ్యతలేని చేపపిల్లలను తెచ్చి పోస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని రోజుల క్రితం మేడ్చల్ పట్టణంలో గల చేపపిల్లల పంపిణీ కేంద్రం వద్ద రెండు లారీల చిన్న సైజు చేప పిల్లలను అధికారులు వెనక్కి పంపేశారు. నాణ్యత లేని సీడ్ పంపిణీ పై ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ బుక్యా మేడ్చల్‌లోని చేప పిల్లల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాణ్యత లేని చేపపిల్లలు చెరువుల్లో పోసిన మరుసటి రోజే చనిపోతున్నాయని మత్సకారులు చెబుతున్నారు. చిన్న చేపపిల్లలను వదిలినా అవి రెండు మూడు నెలల్లో ఎదగవని, సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు నాణ్యతగల చేప పిల్లలు త్వరగా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
- యేటా ఇవే ఇబ్బందులు.. మారని అధికారుల తీరు
ప్రభుత్వం మత్స్యకారులకు అందజేస్తున్న చేపపిల్లల పంపిణీలో యేటా ఇవే ఇబ్బందులు తలెత్తుతున్నా అధికారులు, కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు. తక్కువ సైజు చేపపిల్లల పంపిణీతో పాటు ప్యాకెట్లలో విడుదల చేస్తున్న చేపపిల్లలను తక్కువ సంఖ్యలో వేస్తున్నారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సైజు చేప పిల్లలను సరఫరా చేస్తే తిరిగి పంపించివేస్తున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప నిబంధల ప్రకారం చేప పిల్లలను సరఫరా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు. ఒకసారి తీసుకురావడం, మళ్లీ తిప్పి పంపడం.. నాణ్యమైన చేప పిల్లలను మరోసారి తేవడం.. ఈ తంతంగా అంతా జరిగే నాటిని నెల రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. సెప్టెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిన చేపపిల్లల పంపిణీ ఇప్పటి వరకు సగమైనా పూర్తికాలేదు. నాణ్యమైన, మన వాతావరణానికి అనువువైన చేప పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడి నుం చి తెప్పించి వేయించాల్సిన మత్స్యశాఖ అధికారులు ఆ దిశగా చర్య లు తీసుకోవడం లేదు. దీంతో కాలం గడిచిపోతోందే తప్ప చేప పిల్లల విడుదల పూర్తికావడం లేదంటున్నారు.
- నాణ్యత లేకుంటే వెనక్కి పంపిస్తున్నాం : పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి
చేప పిల్లల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. నాణ్యత లేకున్నా.. తక్కువ సైజు ఉన్నా చేపపిల్లలను వెనక్కి పంపిస్తున్నాం. తరలింపునకు లారీలు దొరక్క పంపిణీ కాస్త ఆలస్యమవుతో ంది. లేటైనా నాణ్యత గల చేపపిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. లక్ష్యం మేరకు జిల్లాలోని అన్ని చెరువుల్లో నాణ్యమైన చేపపిల్లలను వదుళ్తాం.
Updated Date - 2022-10-10T04:42:43+05:30 IST