అలంకారప్రాయంగా!
ABN, First Publish Date - 2022-12-16T00:01:40+05:30
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. గ్రామీణ యువతీ యువకులు క్రీడల్లో రాణించేందుకు ఏర్పాటు చేసిన మైదానాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
బోర్డులకే పరితమైన క్రీడా ప్రాంగణాలు
కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు
నిరుపయోగంగా దర్శనమిస్తున్న మైదానాలు
వ్యాయామానికి దూరంగా క్రీడాకారులు, నిరుద్యోగ యువత
షాద్‌నగర్‌రూరల్, డిసెంబరు 15: గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. గ్రామీణ యువతీ యువకులు క్రీడల్లో రాణించేందుకు ఏర్పాటు చేసిన మైదానాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద లక్షల రూపాయలు ఖర్చు చేసి వీటిని ఏర్పాటు చేసినా ఎవరికీ ఉపయోగం లేకుండా పోయాయి. ఫరూఖ్‌నగర్ మండలంలోని 47 గ్రామపంచాయతీల్లో ఆర్బాటంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కానీ వీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఒక్కో ప్రాంగణానికి రూ. 3 లక్షల ఖర్చు
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఒక్కో క్రీడాప్రాంగణానికి రానున్న రెండేళ్లలో మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఉపాధి హామీ అధికారులు తెలిపారు. మొదటి విడతగా రూ.50వేలతో బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులతోపాటు వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భూమి అనువుగా లేకుంటే మరో 60 వేలు వెచ్చించి చదును చేసుకోవాలి. రెండేళ్లలో ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటి రక్షించుకోవాలి. చివరి వరకు రూ.3లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందని ఏపీఓ అరుణ తెలిపారు.
అనువుగాని చోట ప్రాంగణాల ఏర్పాటు
ఫరూఖ్‌నగర్ మండలంలోని చాలా గ్రామాల్లో అనువుగాని చోట క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు. 47 గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలావరకు వర్షం పడితే ప్రాంగణమంతా నీటితో నిండిపోతోంది. ఒక్కొక్కటి ఎకరం, అర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ చాలా గ్రామాల్లో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేశారు. మరికొన్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు, మూడు గ్రామాల్లో మాత్రమే ప్రాంగణాలను వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది. మిగతావి నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం. క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలతోపాటు ఎలాంటి వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచకపోవడంతో వాటివైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.
కోచింగ్ సెంటర్లకు పరుగులు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకం కోసం అర్హత పరీక్ష నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈవెంట్స్‌లో అర్హత సాధించేందుకు సమాయత్తమవుతున్నారు. అందుబాటులో మైదానాలు లేక నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ వేలల్లో ఫీజులు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు ఊర్లోనే ఈవెంట్లకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడ తన కూతురు జ్యోతి జ్ఞాపకార్థం 90 రోజులపాటు సుమారు 900 మంది నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇప్పించారు. వారిలో 32 మంది ఎస్సై, 96 మంది కానిస్టేబుల్, 17 మంది టెట్ పరీక్షలో అర్హత సాధించారు. అయితే గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు అనుకూలంగా ఉంటే వ్యాయామానికి ఇబ్బంది ఉండేది కాదని పలువురు వాపోతున్నారు. భవిష్యత్తులోనైనా క్రీడాప్రాంగణాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఆర్థిక స్థోమత లేక కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు
ఎస్సై అర్హత పరీక్షలో పాసయ్యాను. ఈవెంట్స్ కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి వద్దనే ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మా చెల్లెలు సుమలత కూడ కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఇద్దరం ఇంటి వద్దనే ప్రాక్టీస్ చేశాం. క్రీడా ప్రాంగణం అనుకూలంగా ఉంటే కొంత ప్రయోజనం ఉండేది.
- తుప్పరి శివకుమార్, వెలిజర్ల, ఎస్సైకి అర్హత సాధించిన అభ్యర్థి
అందుబాటులోకి తెస్తాం
క్రీడా ప్రాంణాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. అందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. రెండు, మూడు గ్రామాల్లో ప్రాంగణాలను నిరుద్యోగులు వినియోగించుకుంటున్నారు. మిగతా వాటిని కూడా త్వరలో సిద్ధం చేస్తాం.
- అరుణ, ఏపీఓ
Updated Date - 2022-12-16T00:01:41+05:30 IST