కుసుమ సాగు.. లాభాలు బాగు!
ABN, First Publish Date - 2022-10-20T04:43:01+05:30
కుసుమ సాగు రైతులకు లాభాలను తెచ్చిపెడుతుంది.
- నవంబర్ నెలాఖరు వరకు సాగుకు అనుకూలం
- మార్కెట్‌లో క్వింటాల్ తెల్ల కుసుమల ధర రూ. 5,441
- సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు
కుసుమ సాగు రైతులకు లాభాలను తెచ్చిపెడుతుంది. మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరగడంతో రానురాను ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కుసుమ సాగు పెంచడానికి రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, నీటితో ఈ పంటను సాగు చేసి ఎక్కువ దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 19 : తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో సాగు చేసే పంటల్లో తెల్ల కుసుమ ఒకటి. దీన్ని పొడి నేలల్లో ఎంచక్కా సాగు చేసుకోవచ్చు. ఏక పంటగానే కాకుండా శనగ, ధనియాల్లో అంతర పంటగా కూడా సాగుచేసుకోవచ్చు. ప్రపంచంలో సుమారు 50 దేశాలకు పైగా దీన్ని సాగు చేస్తుండగా, అత్యధికులు నూనె తీయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ధాన్యం చేతికొచ్చే వరకు వేచి ఉండకుండా పువ్వుల ద్వారా కూడ అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. కుసుమ పంట 120 నుంచి 130రోజుల్లో కోతకు వస్తుంది. ఆధునిక పద్ధతుల్లో కుసుమ సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది సాధారణ సాగు విధానానికి స్వస్తి పలికి ఆధునిక పద్ధతుల్లో కుసుమ సాగు చేపడితే లాభదాయకంగా ఉంటుందంటున్నారు. పూర్వీకుల కాలం నుంచి కుసుమ పంట సాగు చేస్తున్నారు. కుసుమలో ఆయుర్వేద గుణాలు ఉండటంతో పూర్వం ఆ వైద్యంలో వాటిని వాడేవారు. తర్వాత కాలంలో వివిధ రకాల పంట నూనెలు రావడంతో కుసుమ సాగు కొంతవరకు కుంటుపడింది. కానీ.. దశాబ్దకాలం నుంచి కుసుమలోని ఉపయోగాలపై అవగాహన పెరిగి మళ్లీ ఈ పంటకు పూర్వవైభవం సంతరించుకుంటుంది. 2020-21 సంవత్సరంలో 2,326 ఎకరాల్లో తెల్ల కుసుమ సాగు చేయగా... 2021-22లో 5,108 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి యాసంగిలో తెల్ల కుసుమ సాగు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎకరం తెల్ల కుసుమలు సాగు చేసేందుకు రూ.6వేల నుంచి రూ.7వేల ఖర్చవుతుందని, మార్కెట్‌లో క్వింటాల్ కుసుమలకు రూ.5,441 ధర ఉందంటున్నారు. శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలో కుసుమ సాగు ప్రాచుర్యం పొందింది. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న వానాకాలం పంటల స్థానంలో కుసుమ సాగు యాసంగిలో విత్తుకోవాలని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ రెండో వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు కుసుమలు విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నీరు నిలవని, తేమను పీల్చుకునే నల్ల రేగడి, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు అనుకూలం.
ఎకరానికి 4 కిలోల చొప్పున వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. ఐఎ్‌సఎఫ్ 764 రకం విత్తుకుంటే 120 -135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 8క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులుకు, పేనుబంకకు కొంతవరకు తట్టుకుంటుంది.
టీఎ్‌సఎఫ్-1 రకం విత్తుకుంటే 125-130 రోజుల వరకు పంట చేతికి వస్తుంది. ఎకరాకు 6-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును పూర్తిగా, పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. మంజీరా, నారి, పీబీఎ్‌సఎస్-12, డీఎ్‌సఎచ్-185 రకాలను సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
విత్తన శుద్ధి : భూమిలోని శిలీంద్రాల ద్వారా సంక్రమించే రోగాలను తట్టుకునేందుకు కిలో విత్తనానికి 2 గ్రామాలు క్యాప్టన్ లేదా 1 గ్రాము కాబ్చెన్జిమ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం : నల్లరేగడి నేలలు పంటకు నీటి తడి ఇవ్వనవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పూత దశిలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60 శాతం పెరిగే అవకాశముంది.
కలుపు నివారణ : విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు లీటర్ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.
తెల్ల కుసుమ సాగుపై అవగాహన కల్పిస్తున్నాం
తెల్లకుసుమల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. మార్కెట్‌లో స్థిరమైన అమ్మకపు రేటు, అడవి పందుల బెడద లేకపోవడం, యాంత్రీకరణ పద్ధతిలో కుసుమ సాగు చేసుకునే సౌలభ్యం ఉండటంతో జిల్లాలో కుసుమ సాగు ప్రాచుర్యం పొందింది. కుసుమ మొక్కలలో ఔషధ గుణాలున్నాయి. బహుళ ఉపయోగ పంటగా చెప్పుకోవచ్చు. కుసుమ నూనెలో 75-80శాతం ఆమ్లం, శీరంలోని కొవ్వు శాతం తగ్గించి గుండె జబ్బులు, శ్వాస సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది.
- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
Updated Date - 2022-10-20T04:43:01+05:30 IST