RAJU SAFE: మృత్యుంజయుడు.. రాజు
ABN, First Publish Date - 2022-12-16T02:37:56+05:30
వేటకు వెళ్లి పులిగుట్ట గుహలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న షాడ రాజు క్షేమంగా బయటపడ్డాడు. 43 గంటల పాటు నరకయాతన అనుభవించిన రాజును పోలీసులు, వివిధ శాఖల అధికారులు సురక్షితంగా బయటకు....
గుహలో ఇరుక్కొని 43 గంటల పాటు నరకయాతన
జిలెటిన్‌స్టిక్స్, జేసీబీల సాయంతో రాళ్ల తొలగింపు
24 గంటలకు పైగా శ్రమించిన యంత్రాంగం
క్షేమంగా బయటపడ్డ బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స
కామారెడ్డి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వేటకు వెళ్లి పులిగుట్ట గుహలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న షాడ రాజు క్షేమంగా బయటపడ్డాడు. 43 గంటల పాటు నరకయాతన అనుభవించిన రాజును పోలీసులు, వివిధ శాఖల అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం స్నేహితుడు మహేశ్‌తో కలిసి రాజు వేటకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో పులిగుట్ట నుంచి వెళ్తుండగా రాజు సెల్‌ఫోన్ రాళ్లబండ గుహలో పడిపోయింది. దాన్ని తీసుకొని పైకి వస్తుండగా అతని కుడిభుజం రాళ్లమధ్యలో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. మహేశ్ రాత్రంతా అక్కడే ఉండి రాజును బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు తెలియజేశాడు. వారు బయటకు తీసేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో మధ్యాహ్నం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం అర్ధరాత్రి వరకు పోలీసులు రెవెన్యూ, అగ్నిమాపక, అటవీశాఖల అధికారులు జేసీబీల సహాయంతో రాళ్లను పగలగొట్టి రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. రాజు గుహలో తలకిందులుగా ఇరుక్కుపోవడం, శ్వాస సరిగ్గా తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పోలీసులు, వైద్యులు ఆక్సిజన్‌ను అందిస్తూ అతనికి ధైర్యం చెబుతూ వచ్చారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి పర్యవేక్షణలో పోలీసు, అటవీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మొదట గుహ బండరాళ్లను జేసీబీల సాయంతో తొలగించేందుకు ప్రయత్నించగా.. ఆ రాళ్లు కదల్లేదు. దీంతో గుహ వెనుకభాగం నుంచి రాళ్లను తొలగించారు. గుహ లోపలికి అశోక్‌ను పంపించి రాజుకు తాగునీరు, ఓఆర్ఎస్ అందిస్తూ వచ్చారు. చివరికి జిలెటిన్ స్టిక్స్ పెట్టి బండలను పగలగొట్టారు. బండల మధ్య నుంచి రాజు కిందకు జారేందుకు కొబ్బరి నూనెను కూడా వాడారు. 24 గంటలకు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ గురువారం సాయంత్రానికి విజయవంతమైంది. రాజును క్షేమంగా బయటకు తీశారు. అతని భార్య, బంధువులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రాజు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుహ నుంచి బయటకు తీసే క్రమంలో కుడి చేతికి, శరీరం కుడిభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. తన ప్రాణాలు కాపాడిన అధికారులు, గ్రామస్థులకు రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
పోలీసులకు డీజీపీ అభినందన
రాజును రక్షించడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి ఎస్పీతోపాటు ఇతర సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. పోలీసులతోపాటు సహాయక చర్యల్లో సహకారం అందించిన స్థ్థానికులకు డీజీపీ అభినందనలు తెలిపారు.
Updated Date - 2022-12-16T03:10:33+05:30 IST