ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్నుపోటుదారుడికి ప్రజలే బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2022-10-17T09:26:23+05:30

దుబ్బాక, హుజూరాబాద్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నిక భిన్నమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమ్మను వీడిన వాడిని ఎవరూ క్షమించరు
  • రాజగోపాల్‌ మునుగోడుకు స్థానికుడు కాదు
  • ఎంతకు అమ్ముడు పోయారో.. కాంగ్రెస్‌ను 
  • ఎందుకు వీడారో ప్రజలందరికీ తెలిసింది
  • ఎంత ఖర్చు చేసినా ఆయనకు ఓట్లు రావు
  • ఏం చేశారని టీఆర్‌ఎస్‌ ఓట్లడుగుతుంది? 
  • మునుగోడు నియోజకవర్గం మా అడ్డా
  • లీడర్లు పోయినా క్యాడర్‌ ఉంది
  • భారత్‌ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్‌
  • ప్రచారానికి రాహుల్‌, ప్రియాంక రావచ్చు
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి


కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచారని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి!  రూ.వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్మలాంటి పార్టీని అవమానపరిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని గర్జిస్తున్నారు. ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. 


ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న 

టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఎలా ఎదుర్కోబోతున్నారు?

దుబ్బాక, హుజూరాబాద్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నిక భిన్నమైంది. రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్‌ విజయాలను బీజేపీ తమ పార్టీ విజయాలుగా చెప్పుకుంటూ రాష్ట్రంలో పార్టీ బలపడుతోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని భ్రమ పడుతోంది. ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో.. కారణాలు ఏమిటో.. బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఎంత లబ్ధి కలుగుతోందో ప్రజలందరికీ తెలిసిపోయింది. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ చేసిందేమిటో.. ఇక్కడ ప్రతి పౌరుడికీ తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉంటూ గత ఎనిమిదిన్నరేళ్లుగా బీజేపీ ఏం ఒరగబెట్టిందో తెలుసు.  రాష్ట్రంలో ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉంటూ.. నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజల వద్దకు వస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీల వైఫల్యాలు, బీజేపీ అభ్యర్థి వ్యక్తిగత ప్రయోజనాలే నా ప్రచారాస్ర్తాలు.


ధనప్రవాహమే నిర్ణాయక శక్తి అని నమ్ముతున్నారా?

డబ్బులు ఇచ్చినవాళ్లకే ప్రజలు ఓటేస్తారని అనుకోవడం అవివేకం. గత ఎన్నికల్లో ఇతర అభ్యర్థుల ఖర్చుతో పోలిస్తే నాన్న (పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి) సగం కూడా ఖర్చు చేసేవారు కాదు.. అయినా భారీ మెజారిటీతో విజయం సాధించేవారు. ఎందుకంటే ఇక్కడి ఓటర్లు చాలా స్మార్ట్‌. అభివృద్ధి చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించేవాళ్లని కాదు.. ఇప్పటికే చేసి చూపించిన వాళ్లను నమ్ముతారు. నాన్న ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలుసు. గెలిపిస్తే నేనూ నాన్న చూపించిన బాటలోనే నడుస్తా. ధనబలం, అధికార బలం, యంత్రాంగ బలంలో ఆ రెండు పార్టీలతో పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ లేదు. అయినా మేము సానుకూలంగా ముందుకెళ్తున్నాం. టీఆర్‌ఎస్‌, బీజేపీ ధన ప్రవాహాన్ని, నేతల కొనుగోళ్లను, మద్యం పంపకాలను నమ్ముకుంటే.. మేము ప్రజలను, విలువలను నమ్ముకున్నాం.  


కీలక నేతలు వెళ్లిపోవడం నిరుత్సాహంగా లేదా?

ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని తమ కుటుంబంగా ఆదరిస్తున్నారు. మునుగోడు మా అడ్డా.. మా గడ్డ. ఇక్కడ కరడుగట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలున్నారు. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి నాన్నగారు సొంత బిడ్డలా చూశారు. అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేశారు. ఐదున్నర దశాబ్దాలు దాటినా ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కొంతమంది ఇతర పార్టీలకు అమ్ముడు పోయినా.. వారంతా యువకులు. సీనియర్‌ నాయకులు మాత్రం పార్టీలోనే ఉన్నారు. కాంగ్రె్‌సలో పుట్టి పెరిగిన నాయకులెవరూ అమ్ముడు పోలేదు. వారిని ఎప్పటికీ కొనలేరు. ప్రజలంతా నన్ను తమ ఇంటి ఆడపడుచులా భావిస్తూ మద్దతు పలుకుతున్నారు. గ్రామాల్లో మహిళలు ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కట్టె పట్టుకుని నడిచే ముసలమ్మలు సైతం నాతో పాటు అడుగులు వేస్తున్నారు. వారి మద్దతు నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తోంది. ఈసారి ఎమ్మెల్యేగా ఒక మహిళ గెలవాలని మునుగోడులో ప్రతి మహిళా కోరుకుంటోంది.


ప్రచారంలో పార్టీ సీనియర్ల మద్దతు ఎలా ఉంది?

జానారెడ్డి నియోజకవర్గ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చౌటుప్పల్‌ మండల బాధ్యత తీసుకున్నారు. అద్దంకి దయాకర్‌, కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఐలయ్య.. ఇలా సీనియర్‌ నేతలంతా క్షేత్రస్థాయిలో రోడ్‌షోలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు.


వెంకట్‌రెడ్డి గైర్హాజరు.. చర్చనీయాంశమైంది కదా? 

ఆయనంటే నాకు ఎంతో అభిమానం. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించాను. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో సీనియర్‌ నేతగా ప్రచారానికి ఆయన కూడా రావాలని, నాకు మార్గదర్శకత్వం చేయాలని నేను కోరుకుంటున్నాను.


రాజగోపాల్‌ బీజేపీలో చేరడంపై.. మీ అభిప్రాయం?

ఆయన ఎందుకు వీడారో.. ఎంతకు అమ్ముడు పోయారో... ప్రజలందరికీ తెలిసిపోయింది. కని, పెంచి, ప్రయోజకుడిని చేసిన అమ్మను వీడిన వాడిని ఎవరూ క్షమించరు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ కుటుంబానికీ ఇవ్వనంత ప్రాధాన్యం కాంగ్రెస్‌ పార్టీ ఒక్క కుటుంబానికి ఇచ్చింది. ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను వీడి.. స్వప్రయోజనాల కోసం బీజేపీ కండువా కప్పుకున్నారు.  ‘‘మా ఓట్లనే అమ్ముకున్నడు.. మాకేం పని చేయ్యలేద’’న్న మాట ప్రజల్లో ఎక్కువగా ఉంది. ‘‘రాజగోపాల్‌ రెడ్డి ఇక్కడ స్థానికుడు కూడా కాదు. మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి.. పక్కోడు చక్కదిద్దడు కదా? ఈ ఎన్నికలు మనకు.. ఆయనకు కాదు’’ అని ప్రజలకు చెబుతున్నా.  


గెలిస్తే అభివృద్ధి చేస్తామని టీఆర్‌ఎస్‌ అంటోంది కదా?

ఎనిమిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చేయలేన్నదే నా ప్రశ్న. గ్రామాల్లోని యువతకు ఉద్యోగాల్లేవు, ఫీజు రీయింబర్సుమెంటు లేదు, మహిళా సంఘాలకు రుణాల్లేవు, పావులా వడ్డీ రుణాల్లేవు, అభయ హస్తం పథకమే తీసేశారు, రేషన్‌ దుకాణాల్లో గతంలో రూ. 185కే తొమ్మిది సరకులు వచ్చేవి. ఇప్పుడు రూ. 2వేలు పెట్టినా రావట్లేదు. నిత్యావసరాల ధరలు   పెరిగాయి. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చలేదు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు లేవు. ఇవన్నీ నా ప్రచార అంశాలే.


‘భారత్‌ జోడో’ యాత్ర మీ విజయానికి 

దోహద పడుతుందని భావిస్తున్నారా ?

 కులమతాలు, విద్వేషాల పేరుతో ప్రజలను విడగొట్టాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా రాహూల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారు.  ఉప ఎన్నికల సందర్భంగా యాత్ర రాష్టంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది.


ప్రచారానికి ఏఐసీసీ నుంచి ఎవరు రానున్నారు 

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతీ సీనియర్‌ నేత ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర కూడా ఉన్నందున ఏఐసీసీ నుంచి కూడా నేతలు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఏఐసీసీ నుంచి కీలక నేతలు వచ్చే అవకాశాలున్నాయి. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ రావచ్చు. వారి పర్యటనపై త్వరలో స్పష్టత వస్తుంది.  

                                - మునుగోడు నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి


గెలిచాక.. నియోజకవర్గ సమస్యలను  ఎలా పరిష్కరిస్తారు ? 

నారాయణపూర్‌లో పోడు భూముల సమస్య తీవ్రమైనది. నాన్నగారి కృషితో 10వేల ఎకరాలను మూడు దశాబ్దాల క్రితం పేదలు, బడుగు వర్గాలకు ఇప్పించారు. అటవీ భూమి కావడంతో.. దానిని పేదలకు కేటాయించాలంటే పార్లమెంటులో అనుమతి పొందాలి. అప్పుడు నాన్నగారు ఇందిరాగాంధీ గారి వద్దకెళ్లి పార్లమెంటులో బిల్లు పాస్‌ చేయించి ఇప్పించిన భూమి అది. పేదలు, బలహీనవర్గాలు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇందిరాక్రాంతి పథకం కింద బోర్లు వేయించాం. ఐసీడీఎస్‌ పథకంలో మోటార్లు ఇప్పించాం. బ్యాంకులో పట్టాలు పెట్టి 30 ఏళ్లుగా పంట రుణాలు తీసుకుంటున్నరు. కొత్త పాసుబుక్కులు వచ్చే సమయంలో.. ఇది ప్రభుత్వ భూమి, అటవీభూమి అని ప్రభుత్వం ఎలా తీసుకుంటది? దీనిపై ప్రధానంగా దృష్టి సారిస్తా. చర్లగూడెం రిజర్వాయర్‌ ప్రాజెక్టులో పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు, ఉద్యోగాల్లేవు. చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి, మునుగోడులో జూనియర్‌ కాలేజీ లేదు, చండూరులో డిగ్రీ కాలేజీ ఉన్నా స్వంత భవనం లేదు.  ఈ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.

Updated Date - 2022-10-17T09:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising