పంచాయతీల్లో పైసల్ లేవు
ABN, First Publish Date - 2022-08-05T05:28:55+05:30
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు నెలలుగా అందడం లేదు. దీనికి తోడు స్టేట్ ఫైనాన్స్(ఎస్ఎఫ్సీ) నిధులు కూడా ట్రెజరీలో పాస్ కావడం లేదు. దీనికి ఫ్రీజింగే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా పంచాయతీల్లో పైసలు లేక పనులు ముందుకు సాగడం లేదు.
- జీపీలను వేధిస్తున్న నిధుల కొరత
- పలు పంచాయతీలకు ఎస్ఎఫ్సీ నిధులు ఉన్నా పాస్ కాని చెక్కులు
- గ్రామాల్లో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్‌కు ప్రభుత్వం ఆదేశాలు
- పనులన్నీ ఖర్చుతో కూడుకున్నవే కావడంతో తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు
- జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు
కామారెడ్డి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు నెలలుగా అందడం లేదు. దీనికి తోడు స్టేట్ ఫైనాన్స్(ఎస్ఎఫ్సీ) నిధులు కూడా ట్రెజరీలో పాస్ కావడం లేదు. దీనికి ఫ్రీజింగే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా పంచాయతీల్లో పైసలు లేక పనులు ముందుకు సాగడం లేదు. పారిశుధ్య నిర్వహణ అభివృద్ధి పనులు కార్మికుల వేతనాలు, ట్రాక్టర్లకు సంబంధించిన ఈఎంఐలు, విద్యుత్ చార్జీలు ఇలా నెలనెలా చెల్లింపులకు నిధులు లేక పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీల్లో వరుసగా చేపడుతున్న అభివృద్ధి పనులకు సకాలంలో నిధులు మంజూరు కాక ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సర్పంచ్‌లకు ప్రస్తుత సీజన్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. ఎక్కువ శాతం మంది సర్పంచ్‌లు, అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ప్రభుత్వాన్ని ఏమనలేక తర్జనభర్జన పడుతున్నారు.
ఆర్థిక సంఘం నిధుల కోసం తప్పని నిరీక్షణ
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే ఆర్థిక సంఘం నిధులు సకాలంలో అందక పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు, సర్పంచ్‌లకు నిరీక్షణ తప్పడం లేదు. జూన్, జూలైకి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా ఉందని సర్పంచ్‌లు వాపోతున్నారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ప్రతినెల సుమారు 8 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యేవి. కానీ పంచాయతీలకు విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందనే ఉద్దేశ్యంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలని జీపీలకు సూచించింది. ఈ మేరకు జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలు గత ఏడాది ఏప్రిల్‌లో కొత్త బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి డిజిటల్ కీలను ఇటీవలే అందించారు. కానీ రెండు నెలలుగా కేంద్రం నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో సర్పంచ్‌లకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ట్రెజరీలో పాస్ కాని ఎస్ఎఫ్సీ చెక్కులు
ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో జీపీలకు ఎస్ఎఫ్సీ నిధులే గత్యంతరగా మారాయి. ఈ నిధులు సైతం సర్పంచ్‌లకు వాడుకోలేని దుస్థితి. పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు డ్రా చేసుకునేందుకు చెక్కులు ట్రెజరీకి పంపించగా పాస్ కావడం లేదని పలువురు సర్పంచ్‌లు చెబుతున్నారు. దీంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నామంటున్నారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిఽధులతో కలిపి స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తూ వస్తోంది. వీటిని ఆయా గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. చేసిన పనులకు పాలకవర్గం ట్రెజరీకి చెక్కులను పెట్టుకున్నా ఫ్రీజింగ్ కారణంగా పాస్ కావడంలేదని పలువురు సర్పంచులు చెబుతున్నారు.
పంచాయతీల నిర్వహణకు ఇబ్బందులు
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు కాక ఆయా జీపీల నిర్వహణ ఇబ్బందిగా మారుతుందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. పనులు చేసిన వాటికి సకాలంలో బిల్లులు మంజూరుకాక అభివృద్ధి, పారిశుధ్య పనులు ముందుకు సాగడం లేదంటున్నారు. వర్షాకాలం కావడంతో పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పనులు ప్రారంభించగా ఇందుకోసం అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు. అయితే పనులన్నీ ఖర్చుతో కూడుకున్నవే కావడంతో వాటిని ఏ విధంగా చేపట్టాలంటూ సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశుధ్య నిర్వహణ పంచాయతీలకు సవాల్‌గా మారుతుంది. ఇక ఇదిలా ఉండగా నెలనెల పంచాయతీల ద్వారా వివిధ పనులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అభివృద్ధి పనులు, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్లకు సంబంధించిన ఈఎంఐలు, విద్యుత్ చార్జీలకు నెలనెల చెల్లింపులకు నిధులు లేక పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నారు.
Updated Date - 2022-08-05T05:28:55+05:30 IST