క్వింటాలు పసుపునకు రూ.15వేలు ఇవ్వాలి
ABN, First Publish Date - 2022-03-06T05:03:36+05:30
రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు వేదిక, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పాదయాత్ర శనివారం ఆర్మూర్ మీదుగా సాగింది.
ఆర్మూర్‌రూరల్, మార్చి5: రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు వేదిక, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పాదయాత్ర శనివారం ఆర్మూర్ మీదుగా సాగింది. చేపూర్లో బస చేసిన రైతులు, కమిటీ సభ్యులు ఉదయం చేపూర్ నుంచి పెర్కిట్, మామిడిపల్లి, అంకాపూర్ మీదుగా పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు వి. ప్రభాకర్, దేగాం యాదాగౌడ్ మాట్లాడుతూ పసుపు క్వింటాలుకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని, యాసంగి వరి పంటతో పాటు అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.4వేల 500 ఇవ్వాలని, రైతులకు లక్ష రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ముత్యంపేట్, సారంగపూర్, బోధన్ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని అన్నారు. చేపూర్లో వీడీసీ సభ్యులు పాదయాత్రకు భోజనవసతి కల్పించారు. పెర్కిట్‌లో సుర్బిర్యాల్, మెండోర రైతులు పాదయాత్రకు సంఘీబావం తెలిపారు. మామిడిపల్లిలో పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు పాదయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఆర్మూర్, అంకాపూర్ మీదుగా పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవరాం, జక్కలింగారెడ్డి, మంథనిగంగారాం, మహేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:03:36+05:30 IST