ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తహీనతకు చెక్‌

ABN, First Publish Date - 2022-12-15T00:44:58+05:30

జిల్లాలో దాదాపుగా 65 శాతానికి పైగా గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

బుధవారం న్యూట్రీషన్‌ కిట్లను భద్రపరిచేందుకు గదిని పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జనవరి రెండో వారంలో గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లు అందించేందుకు చర్యలు

- అందులో ఖార్జురా, నెయ్యి, ఐరన్‌ సిరప్‌ తదితర పదార్థాలు

- జిల్లాలో 2వేల మందికి అందించనున్నట్లు అధికారుల వెల్లడి

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 14: జిల్లాలో దాదాపుగా 65 శాతానికి పైగా గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రభావంతో పుట్టబోయే చిన్నారుల్లో రక్తహీనత, సికిల్‌ సెల్‌, వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లీబిడ్డ ఆరోగ్యంతో పాటు ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. గతంలో మంత్రి హరీష్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ అధికారులతో, సిబ్బంది సమావేశం నిర్వహించి జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్యను తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని ప్రకటించారు. రక్తహీనతతో బాధపడుతున్న 9 జిల్లాలను గుర్తించామని ఆయా జిల్లాల్లో పైలెట్‌గా న్యూట్రీషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అందులో భాగంగా జనవరి రెండో వారంలో గర్భిణులకు న్యూట్రీషన్‌ కిట్లను పంపిణీ చేసేందుకు జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌, వైద్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌ అధికారులు ప్రభుత్వం పంపిణీ చేయనున్న కిట్లను భద్రపరచడానికి గదిని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2 వేల మందికిపైగా కిట్లను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

పోషకాహార లోప నివారణే లక్ష్యంగా ముందుకు

రాష్ట్రంలో పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కామారెడ్డి, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్త గూడెం, జయశంకర్‌భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కోమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో తల్లికి పౌష్టికాహారం ముఖ్యమని మారుమూల గ్రామాల్లో పౌష్టికాహారం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, అవగాహన రాహిత్యం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కిట్‌లో ఉండేవి ఇవే..

న్యూట్రీషన్‌ మిక్స్‌పౌడర్‌ రెండు కిలోలు, కిలో ఖర్జురాలు, ఐరన్‌ సిరప్‌ మూడు సీసాలు, ప్లాస్టిక్‌బుట్ట, వస్త్రం సంచి, 500 గ్రాముల నెయ్యి, కప్పు, ఆల్బెండాజోల్‌ టాబ్లెట్‌లు ఉంటాయి. ప్రభుత్వం అందించే బలవర్థకమైన ఆహారం సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కావాల్సిన కిట్లను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించి న్యూట్రీషన్‌ కిట్లను భద్రపరిచేందుకు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో కలిసి బుధవారం గదిని పరిశీలించారు.

గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు చర్యలు

- లక్ష్మణ్‌సింగ్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా న్యూట్రీషన్‌ కిట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న గర్భిణులకు న్యూట్రీషన్‌ కిట్లు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల ద్వారా కిట్లను పంపిణీ చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న న్యూట్రీషన్‌ కిట్ల ద్వారా గర్భిణుల్లో రక్తహీనతను నివారించే అవకాశం ఏర్పడుతుంది.

Updated Date - 2022-12-15T00:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising