పసుపు రైతుకు భరోసా ఏదీ?
ABN, First Publish Date - 2022-01-13T05:38:35+05:30
జిల్లాలో వాతావరణ పరిస్థితులను తట్టుకుని పసుపును రైతులు భారీ పెట్టుబడి పెట్టి పండించినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రావడంలేదు. వర్షాలు, తెగుళ్లతో పంట దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న రైతులకు ధరపెంచి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
జిల్లాలో పసుపునకు దక్కని ధర
తెగుళ్లతో తగ్గిన పంట దిగుబడి
కొత్త పసుపు వస్తున్నా.. పెరగని ధర
తేమ, ఇతర కారణాలతో తక్కువ రేటుకు కొనుగోళ్లు
డిమాండ్‌కు అనుగుణంగా ధర పెట్టాలంటున్న రైతులు
నిజామాబాద్, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): జిల్లాలో వాతావరణ పరిస్థితులను తట్టుకుని పసుపును రైతులు భారీ పెట్టుబడి పెట్టి పండించినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రావడంలేదు. వర్షాలు, తెగుళ్లతో పంట దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న రైతులకు ధరపెంచి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాం డ్ ఉన్నా.. వివిధ కారణాలు చెప్పి ధర పెట్టడంలేదు. మార్కెట్‌కు వచ్చే పసుపు రకాలనుబట్టి కొద్ది మందికే అత్యధిక ధర ఇస్తూ మెజార్టీ పసుపును కనిష్ఠ ధరకే కొనుగోలు చేస్తున్నారు. పాత పసుపుతో పాటు కొత్త పసుపు కూడా ఎక్కువ ధర పెట్టడంలేదు. తేమ, కర్కుమిన్ పేరున ధరలు తగ్గిస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉన్న పసుపును డిమాండ్‌కు తగినవిధంగానే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఫ 55వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈ ఏడాది 55వేల ఎకరాల్లో పసుపు సాగుచేశారు. పంట పెట్టినప్పటి నుంచి అధిక వర్షాలు పడడంతో పెరగలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తెగుళ్లు కూడా వచ్చాయి. జూన్ నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు పడడం, ఆ తర్వాత కూడా భూముల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల పసుపు పెరగలేదు. తెగుళ్లు రావడంతో మందుల కోసం భారీగా రైతులు ఖర్చు చేశారు. వీటన్నింటినీ తట్టుకుని స్వల్ప రకాలతో పాటు దీర్ఘకాలిక రకాలను రైతులు సాగుచేశారు. స్వల్ప రకాల పంటలు పూర్తికావడంతో గత నెల రోజులుగా తవ్వకాలు చేస్తున్నారు. వెంటనే ఉడకబెట్టి ఆరబెడుతున్నారు. నిల్వ ఉంచుకునేబదులు ధర ఉండడంతో మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. రేటును బట్టి ఎక్కువ మొత్తంలో తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఫ 20 రోజులుగా కొనుగోళ్లు..
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో గడిచిన 20 రోజులుగా పసుపు కొనుగోళ్లను చేస్తున్నారు. మొదట పాత పసుపును తీసుకువచ్చిన రైతులు ప్రస్తుతం కొత్త పసుపు కూడా తెస్తున్నారు. ప్రతిరోజూ వెయ్యి నుంచి 1500 బస్తాల వరకు పసుపును మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. కొన్ని రోజుల్లో అంతకంటే ఎక్కువగా తెస్తున్నారు. పసుపు కాడా, గోలా రకాలను అమ్మేందుకు తీసుకువస్తున్నారు. మొదట పసుపు ధర క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.9,500 మఽధ్య అమ్మకాలు జరిగాయి. మోడల్ రేటు రూ.7,500 వరకు అమ్మకాలు జరిగాయి. ఎక్కువ మంది రైతులకు క్వింటాలు రూ.7,500 నుంచి 8,500 మధ్యధర వచ్చింది. మార్కెట్‌కు వచ్చే పసుపులో నాణ్యతను బట్టి కర్కుమిన్ శాతానికి అనుగుణంగా ధర నిర్ణయిస్తారు.
ఫ 10 శాతం వరకే అధిక ధరలు..
మార్కెట్‌కు వచ్చే పసుపులో 10శాతంలోపు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. గరిష్ఠ ధర ఇస్తున్నారు. మిగతా 90 శాతం పసుపును రూ. 5వేల నుంచి రూ.7500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి పసుపు ధర తగ్గుతోంది. గత నెల చివరి వరకు రూ.9,500 వరకు క్వింటాలు అమ్మగా ప్రస్తుతం రూ.9వేల లోపే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కాడా రకం మోడల్ క్విం టాలు రూ.6వేల నుంచి రూ.7500 మధ్య నే ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. గోళా రకం 5వేల నుంచి 8వేల మధ్య అ మ్మకాలు జరుగుతుండగా మోడల్ రేటు రూ.6500 లుగానే క్వింటాలుకు ఉంది. ఈ యేడాది దిగుబడి తక్కువగా రావడంతో ధర ఎక్కువరాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో పసుపునకు డిమాండ్ ఉండడం వల్ల అధిక ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
Updated Date - 2022-01-13T05:38:35+05:30 IST