చెర్వుగట్టులో ఆధ్యాత్మిక శోభ
ABN, First Publish Date - 2022-02-09T06:41:27+05:30
ప్రముఖ శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనం గా ప్రారంభమయ్యాయి.
భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి
పాంచాహ్నిక దీక్షతో కంకణధారణ
యాగశాల ప్రవేశం, అగ్ని సమారాధన
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 8: ప్రముఖ శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనం గా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఆలయ మహామండపంలో నిర్వహించిన ప్రారంభ పూజల్లో దీప ప్రజ్వలనతో అఖండ చేసి లాంఛనంగా ఆరంభించారు. ఉత్సవ యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితావధాని, నీలకంఠశాస్ర్తి, ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మలు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రుత్వికుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గణపతిపూజతో ఉత్సవ పూజలను ప్రారంభించారు. స్వామి వారి విశేష ఉత్సవాలు నిర్విఘ్నంగా పూర్తి కావాలని వేడుకుంటూ దీక్షాధారణ చేసి సంకల్పం చేయించారు. యాగశాల ప్రదక్షిణ, ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యహవాచనం, పంచగవ్యప్రాసన, అఖండదీప స్థాపన, త్రిశూల పూజలను నిర్వహించారు. అనంతరం ఆదిదేవుని బ్రహ్మోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. ఉత్సవ ప్రారంభపూజా కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిఽథులను దేవస్థాన చైర్మన్ మేకల అరుణరాజిరెడ్డి, ఈవో మహేంద్రకుమార్‌లు సత్కరించగా యాజ్ఞీకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో మూలవిరాట్టును దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ రేగట్టె నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొండూరు శంకరయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దేవస్థాన సభ్యులు పసునూరి శ్రీనివాస్, మారపాక ప్రభాకర్‌రెడ్డి, రాధారపు భిక్షపతి, కృష్ణయ్య, కల్లూరి శ్రీను, యాదగిరి, దండు శంకరయ్య,వేణు,దేవేందర్, మేక వెంకట్‌రెడ్డి, వంపు శివ, చీర మల్లేశ్, కంకల యాదయ్య, మేడి శంకర్, వెంకటయ్య, దొడ్డి నర్సింహ, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు
స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు ప్రధానాలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణయ్య, మాజీ చైౖర్మన్ పున్నపురాజు యాదగిరి, గడుసు శశిధర్‌రెడ్డి, వారాల రమేశ్, రేగట్టె నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రథసప్తమి సందర్భంగా సూర్యారాధన
రథసప్తమి రోజున చెర్వుగట్టులో పార్వతీ జడల రామలిగేశ్వరుడి కల్యాణం నిర్వహించడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆలయంలో సూర్యారాధన పూజలు నిర్వహించారు. సూర్య యంత్రంలో ఆదిత్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతీ రోజూ అరుణ పారాయణాలతో ఐదు రోజుల పాటు సూర్య నమస్కారాలు చేస్తారు.
Updated Date - 2022-02-09T06:41:27+05:30 IST