మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
ABN, First Publish Date - 2022-12-07T23:55:22+05:30
మునిసిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎండీ సలీం, కన్వీనర్ దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
రామగిరి, డిసెంబరు 7: మునిసిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎండీ సలీం, కన్వీనర్ దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మునిసిపల్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో కార్మికులకు రూ.21వేల వేతనం చెల్లిస్తుంటే తెలంగాణలో మాత్రం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మునిసిపల్ కార్మికులకు పెరిగిన ఎరియర్స్ చెల్లించాలని, సెలవుల్లో పనిచేసిన కార్మికులకు ఒక్కరోజు పూర్తి సెలవు మంజూరు చేయాలన్నారు. కౌన్సిలర్ల వేధింపులు ఆపాలని, హాజరు పట్టికలో లోపాలు అరికట్టాలన్నారు. కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, నాయకులు పెరిక కృష్ణ, పాలడుగు వెంకటేశం, నాగు కరుణ, చింతకాయల సంతోష్, పెరిక అంజమ్మ, గుండమల్ల శ్రీనివాస్, జీడిమెట్ల నరసింహ, ఏర్పుల శ్రవణ్‌కుమార్, దాసరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:55:24+05:30 IST