హైస్కూల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్?
ABN, First Publish Date - 2022-12-16T01:08:05+05:30
చండూరు చౌరస్తాలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో సమీకృత (ఇంటిగ్రేటెడ్) మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు అఽధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే స్థలం పరిశీలించిన ఆర్డీవో
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్థానికులు
చండూరు, డిసెంబరు 15: చండూరు చౌరస్తాలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో సమీకృత (ఇంటిగ్రేటెడ్) మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు అఽధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నల్లగొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. స్థలాన్ని సర్వే చేయాలని సర్వేయర్‌ను ఆదేశించారు. మార్కెట్‌ను తొలుత చౌరస్తాకు సమీపంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయ భూమిలో ఎకరం స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏడాది క్రితం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అప్పటి కలెక్టర్ సైతం వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. కాని ఆలయ భూమికి సంబంధించి పూజారులు కోర్టును ఆశ్రయించారు. ఆలయ భూమిలో సమీకృత మార్కెట్ ఏర్పాటు బాగానే ఉన్నా అందులో మాంసం దుకాణాల ఏర్పాటును వారు వ్యతిరేకించారు. దీంతో స్థలాన్ని పురపాలికకు కేటాయించడంలో జాప్యం జరిగింది. సమీకృత మార్కెట్‌కు సంబంధించి ప్రభుత్వం రూ.2కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణంలో మాత్రం తీవ్ర ఆలస్యమవుతూ వస్తోంది. ఆర్డీవో మంగళవారం వచ్చి హైస్కూల్ ఆవరణాన్ని పరిశీలించి వెళ్లడంతో మార్కెట్ ఏర్పాటులో కదిలిక వచ్చింది.
మైదానం కనుమరుగయ్యే అవకాశం
చండూరు హైస్కూల్ మైదానం ఇప్పటికే అదనపు గదులు, కేజీబీవీ భవనాలు ఇతర నిర్మాణాలతో కుంచించుకుపోయింది. గతంలో పది ఎకరాలకు పైగా మైదానం ఉండేది. ఇప్పుడు కేవలం ఐదు ఎకరాలకు పైగా మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అందులోనే ఎకరం స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో విద్యార్థులకు, స్థానిక యువకులకు, క్రీడాకారులకు మైదానం మొత్తం కనమరుగయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీకృత మార్కెట్ అంటే పండ్లు, పూలు, మాంసం, కూరగాయలు ఇలా అన్ని దుకాణాలు ఉంటాయి. పెద్ద మొత్తంలో జనాలు వస్తారు. దీంతో విద్యార్థులు, క్రీడాకారులకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు.
భూమి చూపించిన చోట ఏర్పాటు చేస్తాం
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు ఎకరం స్థలం కావాల్సి ఉంది. తొలత దేవాలయ భూమిలోనే ఏర్పాటు చేయాలనుకున్నారు. కోర్టు కేసుల మూలంగా ఆలస్యమవుతోంది. అయితే మాకు రెవెన్యూ అధికారులు భూమి చూపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆర్డీవో మంగళవారం స్థానిక హైస్కూల్ మైదానం పరిశీలించి వెళ్లారు.
మణికరణ్, చండూరు మునిసిపల్ కమిషనర్.
హైస్కూల్లో మార్కెట్ ఏర్పాటు సరికాదు
హైస్కూల్ ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు సరైంది కాదు. విద్యార్థులకు, యువకులకు క్రీడా మైదానం దూరమయ్యే ప్రమాదం ఉంది. వెంటనే అధికారులు పునరాలోచించుకోవాలి. మున్సిపాలిటికీ చెందిన భూముల్లో, వెంచర్ నిర్వాహకులు ఇచ్చిన పది శాతం స్థలాలను ఇందుకోసం పరిశీలించాలి.
కొత్తపాటి సతీశ్, స్థానికుడు.
Updated Date - 2022-12-16T01:08:10+05:30 IST