ఉత్తమ్ దమ్ముంటే నాపై పోటీచెయ్
ABN, First Publish Date - 2022-12-31T23:02:27+05:30
ఉత్తమ్ దమ్ముంటే నాపై పోటీ చెయ్.. ఇద్దరం పదవులకు రాజీనామా చేద్దామని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కు సవాల్ విసిరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇద్దరం పదవులకు రాజీనామా చేద్దాం
ఎంపీ ఉత్తమ్‌కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్
హుజూర్‌నగర్, డిసెంబరు 31: ఉత్తమ్ దమ్ముంటే నాపై పోటీ చెయ్.. ఇద్దరం పదవులకు రాజీనామా చేద్దామని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కు సవాల్ విసిరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు ఉన్న ఆస్తులు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని కోర్టులో కేసులు వేశావు, అభివృద్ధి పనులను ఆపేందుకు పదేపదే కాంగ్రెస్ నాయకులతో కోర్టులో కేసులు వేసి పనులు అడ్డుకుంటున్నావు, నీకు దమ్ము, ధైర్యం ఉంటే నీ ఎంపీ పదవికి రాజీనామా చెయ్, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్లీ నాపై నీవు, లేదంటే నీ భార్య దమ్ముంటే పోటీ చేయాలన్నారు. నాకు కోదాడలో రెండు ఫ్లాట్లు ఉన్నాయని, అవి ఎన్నికల అఫిడవిట్‌లో చూపించలేదని, తప్పుడు లెక్కలు చూపెట్టానని కోర్టులో పద్మావతి కేసులు వేశారు. ఈ కోర్టుల్లో కేసులు, అభివృద్ధిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి నీవు కూడా రాజీనామా చేసి, అవసరమైతే ఎన్నికలకు పోదాం అంటూ సవాల్ విసిరారు. కాదు, కూడదు అనుకుంటే హుజూర్‌నగర్‌లో అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. మేథావులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో మీరు ఎక్కడ చర్చ పెట్టినా నేను ఒక్కడినే వస్తానన్నారు. హుజూర్‌నగర్ ప్రాంతంలో మీరు 25 ఏళ్ళలో మీరు ఎంత అభివృద్ధి చేశారు. నేను మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో లెక్కలతో నిరూపిస్తానన్నారు. పులిచింతల ముంపు గ్రామాల్లో ఎంపీ ఉత్తమ్ ఆనాడు ముంపు బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. సమావేశంలో కేఎల్‌ఎన్ రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, కడియం వెంకటరెడ్డి, ప్రదీప్‌గౌడ్, ముల్కలపల్లి రాంబాబు, పచ్చిపాల ఉపేందర్, మీసాల కిరణ్, దొంతగాని శ్రీనివాస్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, విజయ్, అమర్‌గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనియన్ నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డికి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో మంజూరైన రూ.18లక్షలతో పాఠశాల ప్రహరీకి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్‌కు రూ.5లక్షలు, రూ.10లక్షలతో మేడారం నుంచి అన్నారానికి నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Updated Date - 2022-12-31T23:02:28+05:30 IST