గీతకార్మికులకు ‘గీతన్న బంధు’ను ప్రకటించాలి
ABN, First Publish Date - 2022-09-09T05:41:56+05:30
కల్లుగీతవృత్తితో జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులను ఆధుకునే విధంగా ప్రభుత్వం గీతన్న బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాల్‌రాజ్ కోరారు.
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాల్‌రాజ్
ఆలేరు, సెప్టెంబరు 8: కల్లుగీతవృత్తితో జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులను ఆధుకునే విధంగా ప్రభుత్వం గీతన్న బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాల్‌రాజ్ కోరారు. గురువారం ఆలేరులో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. గీతన్న బంధు పథకంలో గీతన్నల బ్రతుకులు మారుతాయని ఆశాబావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, ఈ వృత్తితో గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ఇంకా ఎందరో అంగ వైకల్యం చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, అంగ వైకల్యులైన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోందని తెలిపారు. వెంటనే ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో ఒక నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గీత సంఘం యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గీత కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కోరుకొప్పుల కిష్టయ్య, అధ్యక్షుడిగా పూజారి కుమారస్వామి కార్యదర్శిగా మిట్ట శంకరయ్య, ఉపాధ్యక్షులుగా బండి రాములు, మొరిగాడి బాలరాజు, అజయ్‌కుమార్, లోడె మల్లయ్య, ఈరసారపు ఆంజనేయులు, కార్యదర్శులుగా నరేందర్, వెంకటేష్, తులసయ్య, కోశాధికారిగా సూదగాని సత్యరాజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో సంఘం జిల్లా, మండల నాయకులు బొలగాని జయరాములు దూపటి వెంకటేష్, మొరిగాడి రమేష్, చంద్రశేఖర్, బాలరాజు, పాల్గొని మాట్లాడారు.
Updated Date - 2022-09-09T05:41:56+05:30 IST