దొంగల ముఠా అరెస్టు
ABN, First Publish Date - 2022-12-31T00:24:19+05:30
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం విలేకరులకు వెల్లడించారు.
సూర్యాపేట క్రైం, డిసెంబరు 30 : తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. హుజూర్‌నగర్ పాతబస్టాండ్ ఆవరణలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పాత నేరస్తుడు వేముల కోటేష్, భార్య క్రిష్ణవేణి, అతడికి వరుసకు బావమరిది నల్లగొండ పట్టణానికి చెందిన గుంజ కోటిలుగా తేలింది. వీరు కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని గుర్తించి, విచారించారు. ఈ క్రమంలో నేరేడుచర్లలో మూడు, నకిరేకల్‌లో ఒకటి, హుజూర్‌నగర్‌లో మూడు, ఆంధ్రప్రదేశ రాష్ట్ర పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామంలో ఒక ఇంట్లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అక్కడ చోరీ చేసిన బంగారు ఆభరణాలను విజయవాడలో విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించి హుజూర్‌నగర్‌కు చేరుకుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు రూ.14లక్షల విలువ చేసే 26తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించామన్నారు.
దొంగతనాల్లో దంపతులు
వేముల కోటేష్ గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధుల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. కొన్నాళ్ల తర్వాత జైలు నుంచి వచ్చి 2014లో క్రిష్ణవేణిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కలిసి హాలియా పోలీ్‌సస్టేషన పరిధిలో చోరీలకు పాల్పడగా అక్కడి పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదల అయినప్పటికీ నేరవృత్తిని మానుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు.
బైక్‌ల దొంగ అరెస్టు
బైక్‌లను అపహరిస్తున్న బాల నేరస్తుడిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబందించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక బైక్‌పై బాలుడు రాగా అతడిని ఆపి బైక్ కాగితాలు చూపించాలని కోరారు. అయితే బాలుడు చూపించలేదు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తనతో పాటు మరో స్నేహితుడు కలిసి మోతె, చివ్వెంల, సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో 12 బైక్‌లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. వారు చోరీ చేసిన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాలుడితో పాటు అతడి స్నేహితుడిపై కేసు నమోదుచేశారు. కాగా మరో మైనర్ బాలుడిని చౌటుప్పల్ పోలీసులు దొంగతనం కేసులో పట్టుబడగా ప్రస్తుతం సైదాబాద్‌లోని బాలుర సంరక్షణ గృహంలో ఉన్నాడు. వీరిద్దరు గతంలో గంజాయి కేసుల్లో కూడా పట్టుబడ్డారు. పట్టుబడిన మైనర్ బాలుడిని బాలుర సంరక్షణ గృహానికి తరలించారు. పట్టుబడిన 12 బైక్‌ల విలువ సుమారు రూ.6.5లక్షలు ఉంటుందన్నారు. కేసులను చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ జి. వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ తుల శ్రీనివాస్, సూర్యాపేట పట్టణ ఇన్సపెక్టర్ జి. రాజశేఖర్, హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, నవీన, మహేష్, సిబ్బంది గొర్ల క్రిష్ణయ్య, గోదేశి కర్ణాకర్, ఆనంద్, చీకూరి మధు ఉన్నారు.
పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి కృషి
పోలీసులతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇటీవల మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు పోలీస్ భద్రత పథకం కింద మంజూరైన రూ.8లక్షల విలువ గల చెక్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన అందజేశారు.
Updated Date - 2022-12-31T00:24:22+05:30 IST