చింతపల్లి పోలీస్‌స్టేషన్.. వివాదాలకు నిలయం.. అవినీతిమయం
ABN, First Publish Date - 2022-04-25T05:53:15+05:30
దేవరకొండ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌పై తరుచూ అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్‌ఐలు, సిబ్బంది సస్పెండ్ అవుతూనే ఉన్నారు.
ఇప్పటికే పలువురు ఎస్‌ఐల సస్పెన్షన్
తాజాగా ఎస్‌ఐ, రైటర్ సస్పెండ్
దేవరకొండ/చింతపల్లి, ఏప్రిల్ 24: దేవరకొండ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌పై తరుచూ అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్‌ఐలు, సిబ్బంది సస్పెండ్ అవుతూనే ఉన్నారు. చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌లో మూడు నెలలుగా ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు, రైటర్ యాదగిరి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈనెల 23న ఉత్తర్వులు జారీచేశారు.
భూముల ధరలు, ఇసుక అక్రమ రవాణా..
2017-18లో ఎస్‌ఐగా పనిచేసిన ఎం.నాగభూషణ్‌రావు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. 2019-20లో ఎస్‌ఐగా విధుల్లో చేరిన నారాయణరెడ్డిపై కూడా అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఘటనలు ఉన్నాయి. చింతపల్లి పోలీస్‌స్టేషన్ హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై ఉండడం, పెద్దఎత్తున భూములకు ధరలు పెరగడం, చింతపల్లి మండలంలో ఇసుక డంపుల ద్వారా రాత్రివేళలో హైదరాబాద్‌కు ఇసుక రవాణా వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భూముల ధరలు కూడా రూ.కోట్లలో ఉండడం, పలు రెవెన్యూ కేసులు వివాదంలో ఉండడం, కేసుల విషయంలో పోలీ్‌సస్టేషన్ వద్దకు ప్రజలు రావడం నిత్యకృత్యమైంది. పలు కేసుల్లో అన్యాయానికి గురైన బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడం, వాటిపై విచారణ చేసి ఎస్‌ఐలను సస్పెండ్ చేయడంతోపాటు పలువురిని బదిలీ చేశారు. మండలంలోని కుర్మేడు గ్రామంలో ఓ వివాదాస్పద కేసులో ఒకరిపై పీడీయాక్టు నమోదు చేయడానికి జిల్లా అధికారులకు నివేదికలు పంపారు. ఈ కేసు విషయంలో సదరు వ్యక్తి మండలాన్ని వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడు. అతనిపై పీడీయాక్టు నమోదు చేయకుండా ఉండడానికి రూ.10లక్షలు అడిగి రూ.4లక్షలను అతని వద్ద ఎస్‌ఐ రామాంజనేయులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ కేసు విషయంలో సదరు వ్యక్తి కొంత మంది సహాయంతో జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదుపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్‌ఐ రామాంజనేయులుతోపాటు రైటర్ యాదగిరిలు అతని వద్ద డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్‌ఐ, రైటర్ యాదగిరిలను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
గతంలోనే సస్పెండ్ అయిన ఎస్‌ఐ
చింతపల్లి ఎస్‌ఐ రామాంజనేయులు సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీ్‌సస్టేషన్‌లో పలు ఆరోపణలురావడంతో సస్పెండ్ అయ్యారు. మిర్యాలగూడ పట్టణ ఎస్‌ఐగా పనిచేసే క్రమంలో కూడా పలు ఆరోపణలు రావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అనంతరం కొంత కాలానికి దేవరకొండ పోలీ్‌సస్టేషన్‌కు ఎస్‌ఐగా విధుల్లో చేరి మూడునెలలు పనిచేశారు. ఆ తర్వాత చింతపల్లి ఎస్‌ఐగా బదిలీయైు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.
Updated Date - 2022-04-25T05:53:15+05:30 IST