సంగీత దర్శకుడు ‘చక్రి’ తమ్ముడి తండ్లాట!
ABN, First Publish Date - 2022-04-26T07:53:04+05:30
మధురమైన సంగీతంతో సినీ వినీలాకాశాన్ని ఓలలాడించిన
- సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ఇబ్బందులు
- వీల్‌చైర్‌లో అధికారులు చుట్టూ తిరిగినా నిష్ప్రయోజనం
- స్లాట్ బుకింగ్ పేరిట తిప్పించుకుంటున్న అధికారులు
- కలెక్టరేట్ ఎదుట మీడియాకు గోడు వెళ్లబోసుకున్న బాధితుడు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మధురమైన సంగీతంతో సినీ వినీలాకాశాన్ని ఓలలాడించిన ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ జిల్లా చక్రధర్‌రావు (చక్రి) తమ్ముడు మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రాయితీలు పొందేందుకు కావాల్సిన ప్రధానమైన సర్టిఫికెట్ అది. దాని కోసం ఆయన ఏకంగా రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు! సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన విలేకరుల ఎదుట తనగోడు వెళ్లబోసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన జిల్లా మాధవరావు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి తమ్ముడు. మహిత్ నారాయణ్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడంతో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. తన అన్నయ్య వద్ద నేర్చుకున్న సంగీతాన్నే ఆయన జీవనోపాధిగా ఎంచుకుని, కొత్తగా మ్యూజిక్ స్టూడియోను ప్రారంభించాలనుకున్నారు. వికలాంగుల కోటాకింద రుణంకోసం 2020లో బ్యాంకును ఆశ్రయించగా, వారు సదరం సర్టిఫికెట్ అడిగారు. అప్పట్నుంచికష్టాలు మొదలయ్యాయి.
లాక్‌డౌన్‌తో మొదలైన సమస్య..
సదరం సర్టిఫికెట్ కోసం మాధవరావు2020 మార్చి 18న మీ-సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. మర్నాడే ఆయనకు స్లాట్ బుకింగ్ సమాచారం వచ్చింది. 2020 మార్చి 28న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే, కరోనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్తే.. ప్రస్తుతం అక్కడ పరీక్షలు చేయట్లేదని, సదరం టెస్టుకు మలక్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన మలక్‌పేట ఆస్పత్రి చుట్టూ తిరిగారు. చివరకు, పాత స్లాట్ చెల్లదని, దాన్ని రద్దు చేసి కొత్త స్లాట్ బుక్ చేసుకుని రావాలని పంపేశారు.
పాత స్లాట్ రద్దు కోసం ఆయన హైదరాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి, అక్కడి అధికారులను సంప్రదించగా.. సెర్ప్ అధికారులు మెయిల్ ద్వారా తమకు లేఖ రాస్తే.. పార్ట్ 1 స్లాట్‌లోని వివరాలను తొలగించి, కొత్తగా స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. చివరకు కింగ్ కోఠిలోని సదరం క్యాంపునకు సంబంధించిన ఓ డాక్టర్ వద్దకు వెళ్లారు. ఆ డాక్టర్.. కలెక్టరేట్‌లోని సదరం విభాగం చూసే అధికారులకు ఫోన్ చేసి మాధవరావు సమస్యను పరిష్కరించాలని చెప్పారు. దీంతో మాధవరావు రెండుసార్లు కలెక్టరేట్‌కు వెళ్లారు. అధికారులు ఆ రెండుసార్లూ దురుసుగా వ్యవహరించారు. కలెక్టరేట్‌లో మూడో ఫ్లోర్‌లో ఉన్న సదరం అధికారి వద్దకువెళ్తే ఆయన దురుసుగా వ్యవహరించారని, తన సమస్య పరిష్కారం కావాలంటే అందుకు టైం పడుతుందంటూ ఈసడింపుగా మాట్లాడారని మాధవరావు వాపోయారు.
వందశాతం వైకల్యంతో రెండుకాళ్లూ పూర్తిగా పనిచేయని తన విషయంలో అఽధికారులు ఎందుకింత కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ కోసం ఇలా రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని మాధవరావు వేడుకున్నారు.
Updated Date - 2022-04-26T07:53:04+05:30 IST