ఎంపీటీసీకి 3.. సర్పంచ్‌కు 5 లక్షలు!
ABN, First Publish Date - 2022-08-04T10:16:05+05:30
సుదీర్ఘకాలం సస్పెన్స్ కొనసాగించి చివరకు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది.
- మునుగోడు నేతలకు బంపర్ ఆఫర్లు
- టీఆర్‌ఎ్‌సకు చెందిన క్రిస్టియన్ మైనారిటీ
- సర్పంచ్‌కు బీజేపీ రూ.20 లక్షల ఆఫర్
- టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆశావహుల పర్యటనలు
నల్లగొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం సస్పెన్స్ కొనసాగించి చివరకు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ నేతలు, రాజగోపాల్ రెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు ఎవరికివారు నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానికంగా పట్టు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక నేతలను తమవైపునకు తిప్పుకొనేందుకుగాను వారికి పెద్దమొత్తంలో ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మునుగోడు మండలంలోని క్రిస్టియన్ మైనారిటీ వర్గానికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ ఒకరికి బీజేపీ నేతలు రూ.20 లక్షల ఆఫర్ ప్రకటించారనే ప్రచారం జరిగింది. దీంతో బుధవారం ఉదయమే నియోజకవర్గంలో బేరసారాల సందడి మొదలైంది. క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వ్యక్తి, అదికూడా అధికార పార్టీ సర్పంచ్ బీజేపీలో చేరితే ఓ సంచలనం అవుతుందనే ఇంత భారీ ఆఫర్ ప్రకటించారన్న వార్తలు షికార్లు చేశాయి.
ఈ విషయమై టీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ జడ్పీటీసీ సభ్యుడిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. వాస్తవమేనని ధ్రువీకరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరితే సర్పంచ్‌కు రూ.5 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామంటూ బీజేపీ నుంచి ప్రతిపాదనలు మొదలైనట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బుధవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. చండూరులో డిగ్రీ కళాశాలకు తన వ్యక్తిగత నిధులు రూ.5 లక్షలతో ఫర్నీచర్ అందజేశారు, వీఆర్ఏల సమ్మె శిబిరంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. తనతో వచ్చేవారెవరో తేల్చుకునేందుకు మండలాల వారీగా ప్రజాప్రతినిధులు, నేతలు కూర్చుని చర్చించుకోవాలని రాజగోపాల్‌రెడ్డి సూచించడంతో బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అనుచరులు ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరలేమని, అక్కడే ఉండి సహకరిస్తామని కొందరు చెప్పినట్లు తెలిసింది.
నియోజకవర్గంలో ఆశావహుల విస్తృత పర్యటన
టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు, కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. వాస్తవానికి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నవారు ఏడాది క్రితం నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా ఇంటి పెద్ద మృతి చెందినా, ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడినా, పేదింట్లో పెళ్లి, ఆర్థిక వనరులు లేక ఉన్నత విద్యకు వెళ్లలేని వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. చావు లేదా శుభ కార్యానికి హాజరయ్యారంటే రూ.10 వేలు సాయం అందుతుండటంతో ‘మునుగోడు పంట పండుతోందని’ గత ఏడాదిగా ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది.
ఇటీవల మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ రూ.20 లక్షలతో అంబులెన్స్, ఫ్లోరోసిస్ బాధితుడు అంశుల స్వామికి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చారు. విద్యాసాగర్‌తోపాటు, జడ్పీటీసీ భర్త నారబోయిన రవికుమార్, కంచర్ల కృష్ణారెడ్డి విస్తృతంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటీవల నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో దేవుడి ఇనుప రథానికి మరమ్మతులు చేస్తుండా.. విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెరో రూ.5 లక్షలు, కర్నాటి విద్యాసాగర్ చెరో రూ.లక్ష, కంచర్ల కృష్ణారెడ్డి చెరో రూ.లక్ష, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చెరో రూ.లక్ష అందజేశారు. మరోవైపు మంత్రి జగదీవ్రెడ్డి చేతుల మీదుగా చెరో రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా, నారబోయిన రవికుమార్ చెరి రూ.10వేలు చొప్పున రెండు రోజుల వ్యవధిలోనే అందజేశారు.
Updated Date - 2022-08-04T10:16:05+05:30 IST