PM Modi : ఎలా సాగుతోంది బండి?
ABN, First Publish Date - 2022-12-15T02:42:50+05:30
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్న తీరుపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ను తన వద్దకు పిలిచి ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు.
సంజయ్ పాదయాత్రపై మోదీ ఆరా
ఎంపీ కె.లక్ష్మణ్‌ను పిలిచి మాట్లాడిన ప్రధాని
పది నిమిషాలపాటు ప్రత్యేకంగా సంభాషణ
పాదయాత్రపై నివేదిక ఇవ్వాలని సూచన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి
పార్టీ సమావేశంలో ప్రదర్శించాలని ఆదేశం
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపైనా ఆరా!
నేడు కరీంనగర్లో పాదయాత్ర ముగింపు సభ
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న జేపీ నడ్డా
న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్న తీరుపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ను తన వద్దకు పిలిచి ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని, బండి సంజయ్ పాదయాత్ర ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. దీంతో సంజయ్ యాత్రకు ప్రజల్లో మంచి ప్రతిస్పందన లభిస్తోందని లక్ష్మణ్ చెప్పగా, ‘గుడ్’ అంటూ మోదీ ప్రశంసించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కూడా రోజురోజుకూ మెరుగు పడుతోంద ని లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ జరగనుందని, ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరువుతున్నారని చెప్పారు. దీంతో సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో లభించిన ప్రతిస్పందన గురించి తనకు నివేదిక కావాలని మోదీ అన్నారు.
ఈ నివేదిక ఆధారంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా రూపొందించాలని, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా దానిని ప్రదర్శించాలని సూచించారు. తెలంగాణలో పార్టీకి లభిస్తున్న ప్రతిస్పందన ఇతర ప్రాంతాలకు కూడా తెలిస్తే ప్రేరణగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. కాగా, సంజయ్ పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వ్యక్తమవుతోందని కూడా లక్ష్మణ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.
నేడు కరీంనగర్లో ముగింపు సభ..
బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం కరీంనగర్లో జరగనుంది. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నడ్డా కర్ణాటక నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక.. హెలికాప్టర్ ద్వారా కరీంనగర్‌కు వెళతారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు. కాగా, తన సొంత గడ్డపై బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయాలని బండి సంజయ్ కృతనిశ్చయంతో ఉన్నారు. భారీ జనసమీకరణ కోసం, గడచిన నాలుగు రోజులుగా ఆయన పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేననే సంకేతాలను పంపాలని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. మరోవైపు, ఆరో విడత పాదయాత్ర షెడ్యూల్‌ను ఈ సభలో ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
1400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి..
సంజయ్ యాత్ర బుధవారం 1400 కిలోమీటర్లు పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. తొలి నాలుగు విడతల్లో 13 లోక్‌సభ, 48 శాసనసభ నియోజకవర్గాలు, 21 జిల్లాల మీదుగా 1178 కిలోమీటర్ల మేర కొనసాగింది. తాజాగా బైంసా నుంచి ప్రారంభమైన 5వ విడత యాత్ర 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 222 కిలోమీటర్లు కొనసాగింది. ఇప్పటివరకు 14 భారీ బహిరంగ సభలు, వందకుపైగా మినీ సభలు, పెద్ద ఎత్తున రచ్చబండలు నిర్వహించినట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ జి.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర పదాధికారుల, కోర్ కమిటీ సమావేశం గురువారం ఉదయం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ పాల్గొంటారు.
బీఆర్ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్: సంజయ్
గంగాధర, డిసెంబరు 14: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే వైర్‌సగా మారిందని, దానికి విరుగుడుగా పనిచేసేది బీజేపీ అనే వ్యాక్సిన్ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో బుధవారం ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తాము ఫ్లెక్సీలు పెడితే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులకు వాడుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరెవరికి భాగస్వామ్యముందో విచారణ జరపాలన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసును సీఎం కేసీఆర్ నీరుగారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలనకు చమరగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లో నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
Updated Date - 2022-12-15T08:10:05+05:30 IST