హాస్టల్లో ఎలుకలు..అన్నంలో పురుగులు
ABN, First Publish Date - 2022-08-04T05:57:42+05:30
టెక్నికల్ విద్యా ప్రమాణాల్లో జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మూలమైన గురుకుల పాలిటెక్నిక్ కళాశాల నేడు అధ్వాన పరిస్థితికి చేరుకున్నది.
శిథిలావస్థలో భవనాలు
అధ్వానంగా బాత్‌రూమ్‌లు
అవస్థల్లో పాలిటెక్నిక్ గురుకుల కళాశాల విద్యార్థులు
గజ్వేల్, ఆగస్టు 3 : టెక్నికల్ విద్యా ప్రమాణాల్లో జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మూలమైన గురుకుల పాలిటెక్నిక్ కళాశాల నేడు అధ్వాన పరిస్థితికి చేరుకున్నది. సదరు కళాశాల స్థలంలోనే సువిశాలమైన బాలుర ఎడ్యుకేషన్‌హబ్ అందుబాటులోకి రావడంతో పాలిటెక్నిక్ కళాశాల మాత్రం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. మొత్తం ఆరు బ్లాకులు, 75 గదులలో 320 మంది విద్యార్థులుండే పాలిటెక్నిక్ గురుకుల కళాశాల హాస్టల్‌లో వర్షం వస్తే గదుల్లోకి నీరు వచ్చిచేరుతుంది. చుట్టూ ఖాళీ స్థలం ఉండడంతో పాములు, ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో కళాశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
పస్తులుంటున్న విద్యార్థులు
విద్యార్థులు తినే భోజనంలో పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. పలుమార్లు పురుగులు రావడంతో పస్తులుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. కూరగాయలు అంత రుచిగా ఉండడం లేదని వాపోతున్నారు. ఇక హాస్టల్ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎక్కడికక్కడ నెర్రలు వారడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారయింది. దీంతో ఆరుబయటే విద్యార్థులు స్నానం చే యడంతో పాటు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇక వానొస్తే చాలు పలు గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. హాస్టల్‌లో ప్రాంగణంలో రాత్రి అయితే చీకటిగా ఉంటుండడంతో విద్యార్థులు భయంగా భయంగా బయటకు వస్తున్నారు.
పక్కన అదుర్స్... ఇది రివర్స్
పక్కన చూస్తే ఎడ్యుకేషన్ హబ్ భవనాలు ఎంతో ఆహ్లాదంగా, ఆధునిక హంగులతో, సకల సదుపాయాలతో అందుబాటులోకి వస్తే బాలుర ఎడ్యుకేషన్ హబ్‌ను నిర్మించేందుకు స్థలాన్ని ఇచ్చిన పాలిటెక్నిక్ కళాశాలకు మాత్రం శిక్ష వేసినట్లుగా ఉంది. 40 ఎకరాల పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన స్థలాల్లో పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఉన్నత పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు రావడంతో విశాలమైన ఎత్తైన భవన సముదాయాలు ఆధునిక హంగులతో, సకల సదుపాయాలతో తణుకులీనుతుంటే, భూమిని కోల్పోయిన పాలిటెక్నిక్ కళాశాల మాత్రం శిథిలావస్థకు చేరుకున్నది. తమకు ఒక నూతన భవనాన్ని కట్టించి ఇస్తే బాగుంటుందని లేదా తాత్కాలికంగా ఎడ్యుకేషన్ హబ్‌లో ఉన్న హాస్టల్‌లో వసతి ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థులు కోరుతున్నారు.
11 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
గత నెల 30న రాత్రి వేళలో హాస్టల్లో నిద్రిస్తున్న 11 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో అదే రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించి చికిత్సను అందించారు. విద్యార్థుల కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. గతంలో సైతం హాస్టల్ గదులలోకి అనేక మార్లు ఎలుకలు, ఇతర కీటకాలు రావడంతో విద్యార్థులు భయాందోళనలో మునిగిపోయారు. హాస్టల్ వెనుకాల స్థలంతో పాటు హాస్టల్‌లోని పలు గదులలో పాడైపోయిన వస్తువులను స్టోర్ చేయడంతో అందులోంచి క్రిమికీటకాలు బయటకు వచ్చి విద్యార్థులను కాటువేస్తున్నాయి. పలుమార్లు పాములు విద్యార్థుల కంట పడిన సందర్భాలు ఉన్నాయి. కళాశాల ప్రిన్సిపల్ వెంటనే వేరే బ్లాక్‌లోకి పాడైపోయిన వస్తువులను తరలించారు.
Updated Date - 2022-08-04T05:57:42+05:30 IST