తిండి కొలది ఆరోగ్యం
ABN, First Publish Date - 2022-11-10T23:22:40+05:30
సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు త్వరగా కోలుకునేలా పౌష్టికాహారం కూడా అందజేస్తున్నారు.
సంగారెడ్డి జీజీహెచ్‌లో పక్కాగా ‘డైట్ ’
రోగులకు సమయానికి రుచికరమైన పౌష్టికాహారం
సంగారెడ్డి అర్బన్, నవంబరు 10 : సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు త్వరగా కోలుకునేలా పౌష్టికాహారం కూడా అందజేస్తున్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందిన అనంతరం నాలుగు నెలల నుంచి మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అదజేస్తుండడంతో రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోగులతో పాటు సహాయకులకు సమయానికి భోజనం అందచేస్తున్నారు.
ఇదీ మెనూ..
ఉదయం అల్పాహారం 7.30 నుంచి 8.30 గంటల మధ్య.. ఇడ్లి, పొంగల్, కిచిడి, ఉప్మా, ఐదు బ్రెడ్ ముక్కల్లో ఏదో ఒకటి, ఉడికించిన గుడ్డు, కాచిన పాలు(100 మి.లీ) లేదా కప్పు టీ ఇస్తున్నారు. 12 నుంచి ఒంటిగంట మధ్య మధ్యాహ్న భోజనంలో అన్నం (600 గ్రా.లు), వెజ్ కర్రీ(150 గ్రా.లు), ఆకుకూర పప్పు(150 గ్రా.లు), సాంబారు (200 మి.లీ), ఉడికించిన గుడ్డు, అరటిపండు, పెరుగు(100 మి.లీ) వడ్డిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య రాత్రి భోజనంగా అన్నం (300 గ్రా.లు), పుల్కాలు (2), వెజ్ కర్రీ (150 గ్రా.లు), ఆకు కూరపుప్పు (150 గ్రా.లు), సాంబారు (200 మి.లీ), ఉడికించిన గుడ్డు, పెరుగు లేదా మజ్జిగ అందజేస్తున్నారు.
ప్రతీ వార్డులో మెనూ ప్రదర్శన
450 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతీ వార్డు వద్ద రోగులకు అందించే ఆహార మెనూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని పాత భవనంతో పాటు 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట అందించే ఆహార మెనూలను ఏర్పాటు చేశారు. దీంతో గుత్తేదారు మెనూ ప్రకారం భోజనం వడ్డించకపోతే ప్రశ్నించేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం రోగుల ఆహార మెనూను పక్కాగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అనీల్‌కుమార్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-10T23:23:36+05:30 IST