మూడేళ్లయినా కంపెనీలు రాలే!
ABN, First Publish Date - 2022-12-15T23:47:20+05:30
ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఒక్క యూనిట్ కూడా ఏర్పాటు కాలేదు.
ఏర్పాటు కాని ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు
రెండు గ్రామాల్లో 1,200 ఎకరాలు సేకరించాలని నిర్ణయం
భూసేకరణలో అడ్డంకులు
పరిహారం మొత్తం పెంచాలని నిర్వాసితుల డిమాండ్
కోర్టును ఆశ్రయించిన పలువురు రైతులు
ఇప్పటి వరకు 250 ఎకరాల సేకరణ
జహీరాబాద్, డిసెంబరు 15 : రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కోహీర్, మునిపల్లి మండలాల్లోని వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలం సేకరించాలని మూడేళ్ల క్రితం నిర్ణయించింది. కానీ ఇప్పటికీ ఆయా గ్రామాల్లో ఒక్క యూనిట్ కూడా ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకు సేకరించిన భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వసతుల కల్పన కోసం ఎటువంటి పనులు కూడా జరిగిన దాఖలాలు లేవు.
600 ఎకరాల్లో సర్వే పూర్తి
ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట ఏర్పాటు కోసం ఆయా గ్రామాల్లో 1,200 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో 600 ఎకరాల సేకరణ కోసం సర్వే పూర్తిచేశారు. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కోహీర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొనడంతో రైతులు వ్యతిరేకించారు. చర్చల అనంతరం పరిహారం మొత్తం రూ. 15 లక్షలకు పెంచడానికి ఒప్పుకోవడంతో రైతులు సానుకూలంగా స్పందించారు. వెంకటాపూర్‌లో 58 సర్వే నంబర్లలో 45 మంది రైతులకు చెందిన 100 ఎకరాల భూమికి రూ. 15 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అలాగే మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 93 మంది రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిగిలినవారిలో పలువురు రైతులకు గతంలో పరిహారం చెల్లించారు. రెండు గ్రామాల్లో రైతులు కబ్జాలో ఉన్నప్పటికీ వారి పేర్లు రికార్డుల్లో లేవు. రికార్డుల్లో పేర్లు ఉన్న రైతులు పొజిషన్‌లో లేరు. దీంతో పరిహారం ఎవరికి చెల్లించాలనే దానిపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఎవరికి పరిహారం చెల్లించాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఇప్పటి వరకు 250 ఎకరాలను సేకరించగా త్వరలోనే ఈ భూములను టీఎ్‌సఐడీసీకి అప్పగిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. మరోవైపు మొదట్లో హడావుడిగా భూసర్వే చేసినా ఎలాంటి పురోగతి లేకపోవడం.. ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-12-15T23:47:22+05:30 IST