మోడల్ బస్టాండ్
ABN, First Publish Date - 2022-12-25T23:37:11+05:30
దుబ్బాకలో సకలహంగులతో రూపుదిద్దుకున్న బస్టాండ్ రూ.3.70 కోట్లతో అధునాతన సౌకర్యాలు ఈ నెల 30న ప్రారంభం
దుబ్బాక, డిసెంబరు25: దుబ్బాకలో నూతన బస్టాండ్ సకల హంగులతో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఈ బస్టాండ్ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషితో గతేడాది ఆగస్టులో ప్రభుత్వం రూ.3.70 కోట్లను కేటాయించింది. పనులు ప్రారంభించిన ఏడాదిన్నర లోపే నిర్మాణం పూర్తిచేశారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి చొరవతో ప్రైవేటు ఆర్కిటెక్‌తో బస్టాండ్ నమూనాను రూపొందించారు. ఆ నమూనా ప్రకారం సుమారు ఎకరా 10 గుంటల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. ఇందులో 8 దుకాణ సముదాయాలు, ఒక కేఫ్, కంట్రోల్ రూం, బస్‌పాస్ కౌంటర్, 6 ప్లాట్‌ఫాంలు నిర్మించారు. మొదటి అంతస్తులో రెస్టారెంట్, డ్రైవర్ల విశ్రాంతి గది, ఆఫీస్ రూం ఉన్నాయి. అధునాతన పద్ధతుల్లో మరుగుదొడ్లు నిర్మించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పనులను పరిశీలించిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
ఈ నెల 30న దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు మంత్రులు పర్యటించనున్నారు. వారి పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంతోపాటు గోదాంల నిర్మాణానికి, దుబ్బాక- ముస్తాబాద్ రహదారి విస్తరణకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏర్పాట్లను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మిగిలి ఉన్న బస్టాండ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Updated Date - 2022-12-25T23:37:12+05:30 IST