‘మీసేవా’ తప్పిదం.. లబ్ధిదారులకు శాపం!
ABN, First Publish Date - 2022-10-18T05:29:48+05:30
మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో జరిగిన తప్పిదం పింఛన్ లబ్ధిదారులకు లేని ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
దుబ్బాక, చేర్యాల పోస్టాఫీసుల్లో
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీవాసుల పింఛన్లు
గజ్వేల్, అక్టోబరు 17: మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో జరిగిన తప్పిదం పింఛన్ లబ్ధిదారులకు లేని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా, ఇతర పింఛన్ లబ్ధిదారుల డబ్బు దుబ్బాక, చేర్యాల పోస్టాఫీసుల్లో జమైంది. అక్కడ ఎందుకు జమైందనే మీమాంసలో కొందరు అసలు విషయం తెలుసుకునేందుకు మున్సిపాలిటీకి వెళ్లారు. మున్సిపాలిటీలో ఆధార్‌కార్డు ద్వారా వెతికితే చేర్యాల, దుబ్బాక పోస్టాఫీసుల్లో డిపాజిట్ అయినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయమై అధికారులను విచారిస్తే ఆసరా, ఇతర పింఛన్లను మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని మినహాయించి, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీకి టిక్ పెట్టడంతోనే లబ్ధిదారుల పింఛన్లు ఆయా పోస్టాఫీసుల్లో జమ అయినట్లు చెబుతున్నారు. కమిషనర్ గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదటిసారి తప్పనిసరిగా ఆయా పోస్టాఫీసుల్లోనే తీసుకోవాలన్న నిబంధన ఉందని ఆ తరువాతి నుంచి గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చన్నారు. అచేతనావస్థలో ఉన్న వారి పింఛన్లను డీఆర్‌డీఏ అధికారి, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడే ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. పనులు వదులుకుని అంత దూరం ఎలా వెళ్లాలని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
నేడు గజ్వేల్ మోడల్ స్కూల్‌లో జాబ్‌మేళా
గజ్వేల్ రూరల్, అక్టోబరు 17: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పరిసర ప్రాంత నిరుద్యోగ యువతులకు ఐటీసీ ఫుడ్స్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు 18న గజ్వేల్ మోడల్ స్కూల్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘేవేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తమయ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సిందిగా కోరారు. వివరాలకు 8956071157,9030700352 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Updated Date - 2022-10-18T05:29:48+05:30 IST