వేధిస్తున్న టీచర్ల కొరత!
ABN, First Publish Date - 2022-08-04T05:53:21+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది.
ఏళ్ల తరబడి భర్తీ కాని ఉపాధ్యాయ ఖాళీలు
కుంటు పడుతున్న విద్యాబోధన
ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్, ఆగస్టు3 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయకపోవడంతో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అంతంత మాత్రంగానే కొనసాగుతున్నది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చి దిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలపై దృష్టి సారించడం లేదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. కరోనా తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన మరికొందరు తమ పిల్లలను ప్రైవేట్‌లో చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. అక్కడ స్కూల్ యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భో జనం అందుతుండడంతో కాస్త వారికి ఆర్థిక భారం తగ్గినట్లు అయింది. అసలే చాలీచాలని వసతుల మధ్య చదువుకుంటున్న విద్యార్థుల పాలిట ఉపాధ్యాయుల కొరత శాపంగా మారింది.
3,994 టీచర్లకు..ఉన్నది 3,452 మంది
మెదక్ జిల్లాలో మొత్తంగా 907 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 625, ప్రాథమికోన్నత పాఠశాలలు 136, ఉన్నత పాఠశాలలు 146. వీటిలో 97,771 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత మంది విద్యార్థుల చదువులు సాఫీగా సాగాలంటే సరిపడా ఉపాధ్యాయులు కూడా ఉండాలి. కానీ జిల్లాలో 3,994 మంది ఉపాధ్యాయుల అవసరం కాగా 3,452 మంది మాత్రమే ఉన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. కానీ ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.
పిల్లలు 266.. టీచర్లు ముగ్గురు
పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం తలనొప్పిగా మారింది. సర్కారు బడుల్లో చేరాలని విపరీతంగా ప్రచారం చేశారు. ప్రచారానికి తగిన విధంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగినా ఇప్పుడు అదే సమస్యగా మారింది. సరిపడా ఉపాధ్యాయుల సంఖ్య లేక జిల్లాలో చదువులు కుంటుపడుతున్నాయి. టీచర్ల కొరత కారణంగా గతంలో విద్యావాలంటీర్లతో నెట్టుకొచ్చేవారు. ఇక జిల్లాలో 162 వరకు ఏకో ఉపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. 1-5వ తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాలి. నిబంధనల ప్రకారం ప్రతి 19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ ఆ పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదు. మండల కేంద్రమైన నిజాంపేట ప్రాథమిక పాఠశాలలో 266 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు బోధిస్తున్నారు. ఇదే మండల పరిధిలోని నగరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. జూన్ 27న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు ఉపాధ్యాయుల కొరతపై ప్రశ్నించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మళ్లీ ప్రైవేటు బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం
- రమేష్, డీఈఓ, మెదక్
జిల్లాలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న స్కూళ్లను గుర్తించాం. కొరత ఎక్కువగా ఉన్న స్కూళ్లకు టీచర్లను సర్దుబాటు చేశాం. ప్రస్తుతం విద్యా బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం.
Updated Date - 2022-08-04T05:53:21+05:30 IST