సిగమూగనున్న కొమురవెల్లి
ABN, First Publish Date - 2022-12-15T00:42:15+05:30
బొట్టు, బోనం, పట్నం, సిగం ప్రత్యేకతతో మహిమాన్విత క్షేత్రంగా అలరారుతున్న కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సంకాత్రి పర్వదినం తరువాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్నిగుండాలతో మహాజాతర ముగియనున్నది. 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవంతో మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమురవెల్లి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
మల్లన్న ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ
18న కల్యాణంతో మహాజాతర ప్రారంభం
మూడు నెలలు.. తొమ్మిది వారాల పాటు
మార్మోగనున్న విజయాఛల గుట్టలు
చేర్యాల, డిసెంబరు 14 : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోనుంది. 18వతేదీన నిర్వహించనున్న మల్లన్న కల్యాణోత్సవంతో జానపదుల మహాజాతర ప్రారంభం కానుంది. తోటబావి ప్రాంగణంలో కల్యాణోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
పరమశివుడి ప్రతిరూపం
11వ శతాబ్దంలో కొమురవెల్లిలోని విజయాఛల గుట్టల్లో ఓ ముని తపస్సు చేయగా శివలింగం వెలిసింది. ఆ లింగంపై పెరిగిన పుట్ట మన్నుతో మూలవిరాట్టును రూపొందించి స్వామివారి నాభిలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది. శివపురాణంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించిన మాదిరిగా మల్లన్న పాదాల కింద ముగ్గురు రాక్షసుల తలలున్న నేపథ్యంలో స్వామివారిని పరమశివుడుకి ప్రతిరూపంగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా కొమురవెల్లి గ్రామానికి చెందిన నీలమాంబ, ఆదిరెడ్డి ఆరో సంతానంగా జన్మించి పరమశివుడి పరమభక్తుడిగా శివానుగ్రహంతో శివుడికి ప్రతిరూపంగా మల్లన్న కీర్తింపబుతున్నారని గ్రామీణుల్లో ప్రచారం ఉంది. దశాబ్దాల క్రితం లభ్యమైన హ్యూమాయిన్ చిక్కాల ఆధారంగా పరమశివుని అంశతో మల్లన్న వెలిశాడని వీరశైవపెద్దలు చెబుతున్నారు. మల్లన్న క్షేత్రంలో స్వామి వారి మూలవిరాట్టు పడమరవైపు చూస్తారు. దీంతో కొమురవెల్లి ఆలయం పడమటి శివాలయంగా పేరొందింది.
రెండు రకాల పూజలు.. అపూర్వ ఘట్టాలు
మల్లన్న వీరశైవులకు చెందిన మేడలాదేవిని, యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని వివాహమాడారు. వీరశైవాగమశాస్త్రం ప్రకారం వీరశైవార్చకులు గర్భాలయంలో వేదమంత్రోచ్ఛారణలతో సేవలను నిర్వహిస్తారు. యాదవులు పట్నాలువేసి పూజలు నిర్వహిస్తున్నారు. పసుపు(బండారి)ను ప్రసాదంగా భావిస్తారు. వీరశైవాగమశాస్త్ర ప్రకారం మార్గశిరమాసం చివరి ఆదివారం రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. స్వామివారి తరఫున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశంవారు, అమ్మవార్ల తరఫున కన్యాదాతలుగా మహదేవుని వంశంవారు వ్యవహరిస్తుంటారు. అలాగే ఒగ్గుపూజారులు మహాశివరాత్రి పర్వదినాన పెద్దపట్నం రచించి యాదవ సంప్రదాయం ప్రకారం కల్యాణం చేస్తారు.
మహిమాన్విత చెట్టు.. బోనం నివేదన
ఆలయ ప్రాంగణంలోని గంగిరేగుచెట్టు ఎంతో మహిమాన్వితంగా వెలుగొందుతుంది. భక్తుల కోర్కెలు ఈడేర్చమని మల్లన్నను వేడుకుంటూ ముడుపులు కడుతుంటారు. గంగిరేగుచెట్టు ఆకును, రేగుపల్లను ఔషధంగా స్వీకరిస్తారు. గతంలో గంగిరేగుచెట్టు ప్రాంగణంలోనే కల్యాణాన్ని నిర్వహించగా భక్తులరద్దీ దృష్ట్యా 2014 నుంచి తోటబావి ప్రాంగణంలో నిర్మించిన మండపంలో కల్యాణోత్సవ క్రతువును నిర్వహిస్తున్నారు. మల్లన్నకు ప్రీతికరమైన బోనం నివేదించడం కోసం భక్తులు అక్కడే అందుబాటులో ఉన్న వంటచెరకు, మట్టికుండలు, కూరగాయలను కొనుగోలుచేసి బెల్లంపాయసాన్ని భక్తిప్రపత్తులతో బోనం తయారు చేస్తారు. మల్లన్నకు నివేదించిన అనంతరం ఇంటిల్లిపాది సహంఫక్తి భోజనం చేస్తారు. మట్టికుండలతో పాటు స్వామివారి బండారిని తీసుకెళ్లి పొలాల్లో చల్లుకుంటారు. అంతేకాకుండా బండారిని నిత్యం ధరిస్తూ, నీటిలో సేవిస్తుండటంతో ధీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రతీతి. విజయాఛలగుట్టపై మల్లన్న సహోదరి అయిన ఎల్లమ్మతల్లి వెలిసింది. మల్లన్న దర్శనార్థం వచ్చిన భక్తులు విధిగా అమ్మవారికి బోనం నివేదించి కల్లును శాకగాపోసి ఓడిబియ్యాలు సమరిస్తారు. మల్లన్నను దర్శించుకున్న భక్తులు ఎల్లమ్మను దర్శించుకుంటేనే పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అలాగే భక్తులు మొక్కుబడులుగా ఆలయ సమీపంలోని కోడెలస్తంభం వద్ద కోడెలు కడతారు. అలాగే రాతిగీరెలవద్ద ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే సంతానం కోసం ఒల్లు బండ వద్ద భక్తులు వరం పడతారు.
బ్రహ్మోత్సవాల వివరాలు
18-12-2022 నుంచి 20-03-2023 వరకు మహాజాతర
18-12-2022 రోజున స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర మార్గశిర మాసం ఆదివారం రోజున ఉదయం స్వామివారి వార్షిక విశేష కల్యాణోత్సవం, రాత్రి శకటోత్సవం నిర్వహిస్తారు.
19-12-2022న ఏకాదశ రుద్రాభిషేకం, లక్షభిల్వార్చన
18-02-2023రోజున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12-00గంటలకు లింగోద్భవ వేళ అభిషేకార్చనలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 1-00గంటలకు పల్లకీసేవ, 2-00గంటలకుపెద్దపట్నం
19-02-2023న ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ
05-03-2023న కామదహనం
07-03-2023న వసంతోత్సవం, (హోళీ వేడుకలు)
19-03-2023న రాత్రి 7-00గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ
20-03-2023న తెల్లవారుజామున గురుపూజ, బలిహరణ, అగ్నిగుండ ప్రవేశం, గెలుపు విజయోత్సవం, ఏకాదశ రుద్రాభిషే కం, మహదాశీర్వచనం
అలాగే సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం 22-0-2023 నుంచి ఫాల్గుణమాసం చివరి ఆదివారం 19-03-2023 వరకు 9 వారాల పాటు జాతర జరుగును. పట్నంవారం, లష్కర్వారం, మహాశివరాత్రి పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు జాతరలో ప్రధానఘట్టాలు
Updated Date - 2022-12-15T00:42:17+05:30 IST