వైద్యం దూరాభారం
ABN, First Publish Date - 2022-08-04T05:50:38+05:30
అక్కడ వందల సంఖ్యలో పరిశ్రమలు.. వేల సంఖ్యలో ఈఎ్‌సఐ వైద్యసేవలు పొందే లబ్ధిదారులు.. అయినా కూడా చికిత్స కోసం రాష్ట్ర రాజధానికి, లేదంటే స్థానికంగా ఉన్న ప్రైవేట్ క్లీనిక్‌లకు పరుగులు పెట్టాల్సిందే.. ఆ మండలంలో ఎక్కడా ఈఎ్‌సఐ ఆసుపత్రి లేకపోవడంతో అత్యవర వైద్యం కోసం పరిశ్రమల కార్మికులు ప్రైవేట్ క్లీనిక్లనుఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
పారిశ్రామిక కార్మికులకు అందని ఈఎ్‌సఐ సేవలు
వందల పరిశ్రమలున్నా.. స్థానికంగా లేని ఆసుపత్రి
పారిశ్రామిక వాడకు దూరంగా చికిత్స కేంద్రం
బొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం ప్రాంత కార్మికులకు ఇక్కట్లు
నిత్యం చికిత్స కోసం నగరానికి పరుగులు
అత్యవసర వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కు
జిన్నారం ఆగస్టు 3: అక్కడ వందల సంఖ్యలో పరిశ్రమలు.. వేల సంఖ్యలో ఈఎ్‌సఐ వైద్యసేవలు పొందే లబ్ధిదారులు.. అయినా కూడా చికిత్స కోసం రాష్ట్ర రాజధానికి, లేదంటే స్థానికంగా ఉన్న ప్రైవేట్ క్లీనిక్‌లకు పరుగులు పెట్టాల్సిందే.. ఆ మండలంలో ఎక్కడా ఈఎ్‌సఐ ఆసుపత్రి లేకపోవడంతో అత్యవర వైద్యం కోసం పరిశ్రమల కార్మికులు ప్రైవేట్ క్లీనిక్లనుఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇది జిన్నారం మండలంలో వేలాది మంది ఈఎ్‌సఐ (కార్మిక రాజ్య బీమా) సౌకర్యం గల కార్మికుల దీనస్థితి. మండల పరిధిలో మూడు వందలకు పైగా పరిశ్రమలుండగా.. వాటిలో సుమారు 60 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 80శాతం మంది కార్మికులకు ఈఎ్‌సఐ సౌకర్యం ఉంది. కానీ వీరికి స్థానికంగా వైద్యం అందడం లేదు. బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న ఈఎ్‌సఐ ఆరోగ్య కేంద్రాన్ని ఐదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి తరలించారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో కార్మికులు చికిత్స కోసం దూరాభారం భరించలేక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని వివిద పరిశ్రమలకు చెందిన 45 వేల మంది కార్మికులతో పాటు.. వారి కుటుంబాలకు చెందిన సుమారు 70 వేల మంది వరకు ఈఎ్‌సఐ సౌకర్యం ఉంది. వీరికి అవసరం ఉన్నప్పుడు ప్రాథమిక చికిత్స కోసం స్థానిక డిస్పెన్సరీలను సందర్శించి.. అక్కడి నుంచి ఇతర వైద్యం కోసం నగరంలోని ప్రధాన ఆసుపత్రి లేదా సిఫారస్సులపై ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తారు. కాగా మండలంలో కనీసం ప్రాథమిక చికిత్స చేసే వెసులు బాటు లేదని కార్మికులు వాపోతున్నారు.
మూడు పారిశ్రామికవాడలకు అందుబాటులో లేని వైద్యం
బొల్లారం పరిధిలో గతంలో ఉన్న ఈఎ్‌సఐ ప్రాంతీయ వైద్య కేంద్రాన్ని బాచుపల్లికి తరలించటంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ వందల పరిశ్రమలకు చెందిన వేల సంఖ్యలో ఈఎ్‌సఐ కార్డుదారులు చికిత్స కోసం బాచుపల్లికి వెళ్లలేక నిత్యం స్థానిక క్లీనిక్లనే ఆశ్రయించటం గమనార్హం. ఈ ప్రాంతంలో పని చేస్తున్న వారిలో 80 శాతం వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అందునా పేదలే ఉండటంతో ప్రైవేట్ వైద్యం భారంగా మారింది. ఇక పారిశ్రామిక వాడలయిన గడ్డపోతారం, కాజీపల్లి సహ బొల్లారం ప్రాంత కార్మికుల కోసం స్థానికంగా ఈఎ్‌సఐ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంత కార్మికులకు నిత్యం వైద్య సేవలు అందే అవకాశం ఉంది. గతంలో ఉన్న వైద్య కేంద్రం తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఈఎ్‌సఐ కార్డు సౌకర్యం ఉన్న కార్మికుల సంఖ్యకు సరిపడా వైద్య సిబ్బంది, సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ ఉన్నది. రోగం ఒక చోట ఉంటే మందు మరో చోట అన్న చందంగా మారిన ఈఎ్‌సఐ వైద్యాన్ని కార్మికుల చెంతకు తీసుకురావాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. వైద్య కేంద్రాన్ని బొల్లారంలో తిరిగి ఏర్పాటు చేయాలని ఇటీవల సీఐటీయూ నాయకులు అధికారులకు వినతి పత్రం కూడా అందజేశారు.
Updated Date - 2022-08-04T05:50:38+05:30 IST