విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-12-16T23:54:50+05:30
గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని,లేకపోతే విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడులకు దిగుతామని సర్పంచులు హెచ్చరించారు.
వారం రోజుల్లో పరిష్కరించకపోతే విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడులకు దిగుతాం
మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల హెచ్చరిక
అక్కన్నపేట, డిసెంబరు 16: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని,లేకపోతే విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడులకు దిగుతామని సర్పంచులు హెచ్చరించారు. శుక్రవారం అక్కన్నపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి జరిగే మండల సర్వసభ్య సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ అన్నాడి దినే్‌షరెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు వాగులో నుంచి ఇసుకను తీసుకొచ్చేందుకు కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డిని సర్పంచులు జిల్లెల అశోక్‌రెడ్డి, గొర్ల కుమారస్వామి, ఎంపీటీసీ పెసరు సాంబరాజు కోరారు. గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. వివిధ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదని, సీడీపీవో ప్రతీసారి సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కన్నపేట, రామవరం ప్రభుత్వాస్పత్రుల్లో రాత్రి పూట కూడా వైద్యసేవలు అందించేందుకు వైద్యులను నియమించాలని సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది అధికారులు సమావేశానికి వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ భూక్య మంగాశ్రీనివాస్, ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:54:51+05:30 IST