అట్టహాసంగా జిల్లాస్థాయి క్రీడలు ప్రారంభం
ABN, First Publish Date - 2022-10-14T04:49:48+05:30
వర్గల్ మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
పాల్గొన్న 16 పాఠశాలలు, 7 కళాశాలల విద్యార్థులు
క్రీడోత్సవాలను ప్రారంభించిన గజ్వేల్ ఏసీపీ రమేష్
వర్గల్, అక్టోబరు 13: వర్గల్ మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గజ్వేల్ ఏసీపీ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. నేటితరం విద్యార్థులు ఎంతో మేధస్సు ఉన్న విజ్ఞానవంతులన్నారు. చిన్న చిన్న సమస్యలకు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు శరీర దారుఢ్యానికి దోహదపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాఫూలే డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి, మెదక్ జిల్లా ఆర్‌సీవో ప్రభాకర్, ఏజీవో కరుణాకర్, ఎంజేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రావు, పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, మిషన్ భగీరథ డీఈ సులోచన ఉన్నారు.
క్రీడల్లో పాల్గొన్న 700 మంది విద్యార్థులు
మహాత్మా జ్యోతిబాఫూలేలో ప్రారంభమైన క్రీడా పోటీల్లో అండర్-14 విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 16 పాఠశాలల విద్యార్థులు, అండర్-19 విభాగంలో 7 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మూడురోజుల పాటు నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోకో, బ్యాడ్మింటన్, వాలీబాల్‌తో పాటు అథ్లెటిక్స్‌లో సత్తా చాటనున్నారు.
Updated Date - 2022-10-14T04:49:48+05:30 IST