చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు
ABN, First Publish Date - 2022-10-18T05:13:36+05:30
అధికారుల ఒత్తిడితో రూ.లక్షల్లో అప్పుచేసి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తే.. నెలలు గడుస్తున్నా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆవేదన
హత్నూర, అక్టోబరు 17: అధికారుల ఒత్తిడితో రూ.లక్షల్లో అప్పుచేసి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తే.. నెలలు గడుస్తున్నా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షుడు వావిలాల నర్సింహులు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. పల్లెప్రగతి, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా మైదానాల పేరుతో అనేక పనులు చేసినా, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచులు గోడు వెల్లబోసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ మండలాధికారులు ఇంకా పనులు చేయాలంటూ తమపై ఒత్తిడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో బిల్లులు అందేలా చూస్తామని ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శారదాదేవి పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:13:36+05:30 IST