ట్రాఫిక్ పోలీసులు లేకున్నా ఫైన్ పడుద్ది
ABN, First Publish Date - 2022-07-27T05:30:00+05:30
ట్రాఫిక్ పోలీసుల కన్ను కప్పి అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారి ఆట కట్టించడానికి పోలీసులు సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. జూలై 1 నుంచి ఇవి పనిచేయడం మొదలుపెట్టాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్‌స్పీడ్, సెలఫోన్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి వీటిని ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలో 11 చోట్ల సీసీ కెమెరాలు
సిద్దిపేట క్రైం, జూలై 27 : ట్రాఫిక్ పోలీసుల కన్ను కప్పి అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారి ఆట కట్టించడానికి పోలీసులు సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. జూలై 1 నుంచి ఇవి పనిచేయడం మొదలుపెట్టాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్‌స్పీడ్, సెలఫోన్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి వీటిని ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఆటోమెటిక్ కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ఫైన్ జనరేట్ చేస్తాయి. జిల్లా కేంద్రంలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతీ రోజు 200 వరకు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌ల పరిధిలో మొట్టమొదట సిద్దిపేటలోనే ఇలా కెమెరాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా, విక్టరీ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, నర్సాపూర్ చౌరస్తా, బీజేఆర్ చౌరస్తాలలో వీటిని బిగించారు.
ఆరు నెలల్లో 1,40,421 కేసులు
సిద్దిపేట జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో ట్రాఫిక్ నియమాలను అధిగమించిన వారిపై 1,40,421 కేసులు నమోదు చేశారు. వీటిలో హెల్మెట్ ధరించకుండా నడిపినవారిపై 1,32,601 కేసులు, రాంగ్‌రూట్‌లో వెళ్లినవారిపై 1,861 కేసులు, ట్రిపుల్ రైడింగ్ ప్రయాణాలపై 2,746 కేసులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై 1,209 కేసులు నమోదు చేశారు. రూ.100 నుంచి రూ.1,200 వరకు జరిమానా విధించారు.
ట్రాఫిక్ నియమాలను పాటించాలి : ఫణిందర్, ట్రాఫిక్ ఏసీపీ
వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉల్లఘించేవారిని గుర్తించడం కోసం సిద్దిపేటలో 11 ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతీ వాహనదారుడి క్షేమమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశాం. రోజూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.
Updated Date - 2022-07-27T05:30:00+05:30 IST