కాళ్లకల్‌లో కేసులు తగ్గుముఖం
ABN, First Publish Date - 2022-08-04T05:54:30+05:30
కాళ్లకల్‌లో వాంతులు, విరేచనాల కేసులు తగ్గుముఖం పట్టినట్లు మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు
తూప్రాన్ (మనోహరాబాద్), ఆగస్టు 3: కాళ్లకల్‌లో వాంతులు, విరేచనాల కేసులు తగ్గుముఖం పట్టినట్లు మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. బుధవారం కాళ్లకల్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టినట్లు వెంకటేశ్వర్రావు వివరించారు. వైద్యశిబిరం గురువారం సైతం కొనసాగిస్తామని చెప్పారు. వైద్యసిబ్బంది కాళ్లకల్‌లో అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధుల ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నామని, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామని రిపోర్టులు గురువారం వస్తాయన్నారు. ఆ రిపోర్టులు వస్తే వాంతులు, విరేచనాలకు గల కారణాలు తెలుస్తాయని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరకు వైద్యశిబిరానికి 228 మంది రోగులు వచ్చినట్లు చెప్పారు. వీరిలో 12 మంది జ్వరంతో, ఐదుగురికి విరేచనాలు, ముగ్గురికి వాంతులు అవ్వడంతో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యసిబ్బంది వివరించారు.
కాళ్లకల్‌లో శానిటేషన్
కాళ్లకల్‌లో బుధవారం ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. అదనంగా 15 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి మురుగు కాలువలు శుభ్రం చేశారు. సర్పంచు నత్తి మల్లేశ్, కార్యదర్శి సామ్యూల్రెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ చర్యలు తీసుకున్నారు. ఎక్స్వేటర్లను ఏర్పాటు చేసి నిలువ నీటిని తొలగించారు. శానిటేషన్ కార్యక్రమం గురువారం కూడా కొనసాగించనున్నట్లు చెప్పారు.
నీరు కలుషితమవ్వలేదు
కాళ్లకల్ గ్రామానికి సరఫరా అవుతున్న వాటర్ శాంపిళ్లను సేకరించి టెస్టుకు పంపారు. బుధవారం కెమికల్ టెస్టు రిపోర్టులో నీరు సాధారణంగానే ఉన్నట్లు తెలిందని మిషన్‌భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీనివాస్ తెలిపారు. బయోలాజికల్ టెస్టు రిపోర్టు గురువారం వస్తుందన్నారు. కాళ్లకల్‌లో ఉన్న ఆరు ఆర్వో వాటర్ ప్లాంట్ల వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు.
Updated Date - 2022-08-04T05:54:30+05:30 IST