దిగుబడి దిగులు
ABN, First Publish Date - 2022-12-07T22:28:19+05:30
పత్తి దిగుబడులు తగ్గడంతో అన్నదాత దిగులు చెందుతున్నాడు. పెట్టుబడులు కూడా ఎల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ధరలు ఉన్నా దిగుబడి లేక నష్టపోతున్న పత్తి రైతులు
ఏటా తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన
ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లు వస్తే గగనమే..
పెరిగిన కూలీల రేట్లు, పెట్టుబడి ఖర్చులతో కుదేలు
నకిలీ విత్తనాలే కారణమంటూ ఆవేదన
భిన్నంగా శాస్త్రవేత్తల నివేదికలు
గద్వాల, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి) : పత్తి దిగుబడులు తగ్గడంతో అన్నదాత దిగులు చెందుతున్నాడు. పెట్టుబడులు కూడా ఎల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగుళాంబ జిల్లాకు పత్తి సాగులో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ సీడ్ పత్తి సాగుతోపాటు వాణిజ్య పత్తి కూడా ఏటా సాగు చేస్తారు. నల్లరేగడి భూములు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతాయి. దిగుబడులు కూడా రెండేళ్ల క్రితం వరకు బాగానే ఉండేవి. పెట్టిన పెట్టుబడులు పోను.. పత్తి సాగు చేసిన వారికి కొంతమేర లాభసాటిగానే ఉండేది. అయితే రెండేళ్లుగా పత్తి దిగుబడులు అమాంతం పడిపోతున్నాయి. భూములు సారవంతంగానే ఉన్నా, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగానో.. లేక అధిక వర్షపాతమో కానీ రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో చాలా రకాల పత్తి విత్తన కంపెనీలు తమ సీడ్స్‌ను విక్రయిస్తాయి. కొన్ని రకాల విత్తనాలు సాగు చేసిన వారికి దిగుబడులు బాగానే వస్తున్నా, కొన్ని రకాలు సాగు చేసిన వారికి మాత్రం దిగుబ డులు తగ్గిపోతున్నాయి. పైకి వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని చెబుతున్నా, విత్తనాల నాణ్య త సరిగా లేనందునే పంట సరిగా రావడం లేదని రైతు లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూలీ రేట్లు అధికంగా ఉండటం, పత్తి సాగులో కూలీలు ఎక్కువగా అవసరం కావడం, ఎరువులు, పురుగు మందుల రేట్లు కూడా క్రమేపి పెరుగుతుండటంతో వచ్చిన దిగుబడికి, పెట్టిన పెట్టుబడికి కూడా సరిపోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర సగటున క్వింటాలుకు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు ధర ఉంది. సీసీఐ ధరతో పోల్చితే ఇది చాలా మంచి ధరే. కానీ దిగుబడులు లేకపోవడంతో ధర ఉన్నా.. రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
2.22 లక్షల ఎకరాల్లో సాగు..
గద్వాల జిల్లా పరిధిలో ఈ ఏడు 99,445 మంది రైతులు 2.22 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. వర్షాలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే కురవడంతో నీటి ఎద్దడి వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. నల్లరేగడి భూ ములు కావడం వల్ల పత్తి ఏపుగానే పెరిగింది. సాధారణం గా ఎకరా విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తే 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ ఎకరాకు ప్రస్తుత పరిస్థితిని చూస్తే 3 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావడమే గగనంగా కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే సాధారణ దిగుబడి కంటే 7 నుంచి 10 క్వింటాళ్లు తక్కువగా వస్తోంది. ప్రస్తుతం సీసీఐ ధర కంటే బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువ ధర పలుకుతోంది. కానీ దిగుబడులు ఆశించినంతగా లేకపోవడంతో ధరలు ఉన్నా.. రైతులు నష్టపోతున్నారు. గత సంవత్సరం కూడా రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. దిగుబడి తగ్గిపోవడంతో పెట్టిన పెట్టు బడులు కూడా రాకపోవడంతో అప్పులపాల య్యారు. పత్తి సాగుకు ఎకరాకు కనీసం రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఖర్చవుతుంది. పత్తి తీయడానికి క్వింటాల్‌కు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఖర్చవుతుంది. పంట మొదట్లో నాణ్యమైన దిగు బడి వస్తుంది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మొదట తీసే పత్తి కూడా నాణ్యంగా రావడం లేదు. ఎకరా కు సగటున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా.. రూ.32 వేలే ఎకరాకు ఆదాయం వ స్తుంది. పెట్టుబడులు, కూలీ ఖర్చు లు తీసేస్తే రైతులు మరో రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. సాధారణంగా జనవరి వరకు పత్తి తీసే రైతులు దిగు బడులు లేకపోవడంతో అక్టోబరు, నవంబరు మాసాల్లోనే పం టను తొలగిం చాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
నాణ్యతా లోపమే కారణం..
ఏటికేడు పత్తి దిగుబడి తగ్గడానికి విత్తనాల నాణ్యత లోపమే కారణమనే భావన మెజారిటీ రైతుల్లో ఉంది. గతంలో ప్రతీ 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్‌లో 25 గ్రాముల చొప్పున నాన్ బీటీ విత్తనాలను ప్రత్యేక ప్యాకింగ్‌లో ఇచ్చేవారు. ఆ 25 గ్రాముల విత్తనాలను రైతులు పొలం గట్ల వెంట విత్తితే బీటీ మొక్కలకు చీడపీడల సమస్యలు ఉండేవి కావు. అయితే రైతులు అవి నాన్‌బీటీ అని తెలిసి వాటిని పక్కన పడేస్తుండటంతో విత్తన కంపెనీలు నాన్ బీటీ విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేయడం లేదు. దీంతో నాన్‌బీటీ విత్తనాలను కూడా బీటీ విత్తనాల్లోనే కలిపి ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నాన్ బీటీ, బీటీ విత్తనాలకు తేడా తెలియక చీడపీడలు ఎక్కువగా ఆశిస్తూ పంట నష్టం జరుగుతోంది. మెరుగైన విత్తనాలు సరఫరా చేసిన కంపెనీల దిగుబడి బాగానే వస్తుండటం, చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉండటం వల్ల ఈ తేడాను రైతులు గమనిస్తున్నారు. పంటనష్టం జరిగితే శాస్త్రవేత్తల బృందాలు పర్యటించి, శాంపి ళ్లను పరీక్షించిన తర్వా త వాతావరణ సమస్య లు, పురుగు మందుల అధిక వినియోగం వంటి కారణాల వల్లే నష్టం జరుగు తుందని నివేదికలు ఇస్తున్నారు. ఒకవేళ వాతావరణ సమస్య, పురుగు మందులు అధికంగా విని యోగిస్తే అది అన్ని కంపెనీల విత్తనా లకు వర్తించాలి. కానీ కేవలం కొన్ని కంపె నీల విత్తనాలే దెబ్బతినడంతో శాస్త్రవేత్తల ఫలితాలు తప్పుగా ఉంటున్నాయనేది స్పష్ట మవుతోంది. గతేడాది ఓ కంపెనీ విత్తనాలు సాగు చేసిన రైతులు కాయలు రాక నష్టపోతే ఏపీలో పరి హారం ఇచ్చిన సదరు కంపెనీ, తెలంగాణలో మాత్రం పురుగుల మందుల వాడకం వల్ల పంట నష్టం జరిగిం దని, విత్తనాల నాణ్యత బాగానే ఉందని శాస్త్రవేత్తలు రిపోర్టు ఇచ్చారు. దీనివల్ల ఇక్కడి రైతులకు పైసా నష్ట పరిహారం అందలేదు. దీనిబట్టి చూస్తే శాస్త్రవేత్తల పరీక్షలపైనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి.
నిండా మునిగాం
నాకున్న ఎకరం పొలానికి తోడుగా ఎకరం రూ.15 వేల చొప్పున మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. అలంపూర్ చౌరస్తాలోని ఓ దుకాణంలో విత్తనాలు తెచ్చి విత్తాను. ఎకరానికి క్వింటాల్ దిగుబడి కూడా రాలేదు. ఎదుగుతున్న దశలో పూత, తర్వాత కాత రాలేదు. ఎన్నడూ లేనివిధంగా లద్దెపురుగు ఆశించడంతో సుమారు రూ.4 లక్షల మేర నష్టపోయాను. మొక్కలు తీసుకుని షాపు వద్దకు వెళ్తే కంపెనీ వారు వస్తారు, చూస్తారంటూ కాలపయాపన చేస్తున్నారు. గట్టిగా అడిగితే కోర్టుకు వెళ్లమంటున్నారు.
- బుచ్చాలు, రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం
ప్రభుత్వమే ఆదుకోవాలి
కంపెనీ విత్తనాలు అని నమ్మి తెచ్చి సాగు చేస్తే చివరికి అప్పులే మిగిలాయి. 18 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తే ఎకరాకు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట సాగుకోసం బయట అప్పులు తెచ్చాను. వాటిని తీర్చేందుకు మార్గం కనిపించడం లేదు. విత్తన కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. బీటీ విత్తనాల్లో నాన్ బీటీ విత్తనాలు కలుపకుండా, ప్రత్యేక ప్యాకెట్‌లో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
- అరుణ్, రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం
Updated Date - 2022-12-07T22:28:21+05:30 IST