ఆగిపోయిన కేజ్ కల్చర్
ABN, First Publish Date - 2022-10-18T04:25:56+05:30
చేపల పెంపకంలో తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చేందుకు ఉపయోగపడుతుందని భావించి ప్రవేశపెట్టిన కేజ్ కల్చర్ క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.
మత్స్యకారుల ఆశలపై నీళ్లు
సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో ముందుకు సాగని చేపల పెంపకం
160 మంది మత్స్యకారులకు దక్కని ఉపాధి
రెండో ఏడాది బలమైన గాలులకు తిరగబడ్డ సామగ్రి
తీవ్రంగా నష్టపోయామంటోన్న మత్స్యకారులు
చేపల పెంపకంలో తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చేందుకు ఉపయోగపడుతుందని భావించి ప్రవేశపెట్టిన కేజ్ కల్చర్ క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఎంతో లాభం పొందుతామని ఆశించిన మత్స్యకారులకు పెట్టిన పెట్టుబడి సైతం రాకపోగా, సమయం కూడా వృథా అయ్యింది. రిజర్వాయర్లలో గాలుల తీవ్రతను అంచనా వేసి, సరైన ప్రాంతంలో నిర్మాణం చేపట్టకపోవడం, ఆ తర్వాత నిర్వహణ లోపాల వల్ల శ్రమ, పెట్టుబడి నీటి పాలైంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్‌ల వద్ద ఈ పరిస్థితి నెలకొంది. పెట్టుబడి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
- మహబూబ్‌నగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో 2018-19లో కేజ్ కల్చర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. సంగంబండలో ఆరు యూనిట్లు, భూత్పూర్‌లో రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ ద్వారా సుమారు 20 మంది మత్స్యకారులకు ఉపాధి కలిగేలా ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.9 లక్షల వరకు వ్యయం అయ్యింది. అందులో రూ.6 లక్షల చొప్పున మత్స్యశాఖ సబ్సిడీ ఇవ్వగా, మిగిలిన రూ.3 లక్షలను మత్స్యకారులే భరించారు. ఒక్కో యూనిట్ పరిధిలో 40 వేల చేప పిల్లలను పెంచేలా దీన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఏడాది ఒక్కో యూనిట్‌లో సుమారు మూడు మెట్రిక్ టన్నుల మేరకు ఉత్పత్తి వచ్చింది. మొదటి ఏడాది దాదాపు అంతా సాఫీగా సాగితే, రెండో యేడాదికి మాత్రం పరిస్థితి మారిపోయింది. వర్షాకాలం వచ్చి, తీవ్ర గాలులతో కేజ్ కల్చర్ కోసం ఏర్పాటు చేసిన వలలు తెగిపోవడం, డ్రమ్ములు, నిర్మాణం తిరగబడడంతో చేప పిల్లలు సైతం రిజర్వాయర్‌లో కలిసిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు వాపోయారు. ఆ సమయంలో తమకు పరిహారం ఇప్పించాలని ఉన్నతాధికారులకు మత్స్యకారులు విన్నవించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపినా పరిహారం మాత్రం రాలేదు. ఇక్కడ కేజ్ కల్చర్ ఏర్పాటుకు ముందు ఇక్కడి మత్స్యకారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో, జార్ఖండ్ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో దీని అమలుపై శిక్షణ ఇప్పించారు. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు వచ్చేసరికి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధానంగా ఇక్కడి రిజర్వాయర్లలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, నిర్మాణంలో లోపాలు, నిర్వహణలోనూ ఇబ్బందులు వల్ల కేజ్ కల్చర్ రెండో యేడాది నుంచి ఆగిపోయింది. వ్యయం, మత్స్యకారులు వాటా ధనంగా చెల్లించిన మొత్తం కూడా వృథా అయ్యింది. తమను ఆదుకోవాలని మత్స్యకారులు 2019లో మత్స్యశాఖ అధికారులకు విన్నవించగా, అప్పటి ఉన్నతాఽధికారులు ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. మత్స్యశాఖ నుంచి ఎలాంటి పరిహారం గానీ, బీమా గానీ ఇవ్వలేమని మత్స్యకారులకు స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇటు మత్స్యకారులు, అటు అధికారులు ఇక్కడ కేజ్ కల్చర్‌ని వదిలేశారు. మూడేళ్ల నుంచి చేపలపెంపకం లేకపోవడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందనే ఆవేదన మత్స్యకారుల నుంచి వస్తోంది. సామాగ్రిని వేరే చోటకు తరలించాలని మత్స్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేశాకే వాటిని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కేజ్ కల్చర్ కొనసాగించడానికి వాటి నిర్మా ణంలో ఏమైనా మార్పులు చేయడం గానీ, లేక రిజర్వా యర్‌లో అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, అక్కడకు మార్చిగాని ఏర్పాటు చేసే అంశంపైనా మత్స్యశాఖ అధికారులు రెండేళ్లుగా దృష్టి సారించక పోవడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దృష్టి సారించి 160 మంది మత్స్యకారులకు ఉపాధి చూపాలని, దాదాపు రూ.40 లక్షల వరకు నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పరిశీలించి నివేదిక ఇస్తాం
సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్‌లలో కేజ్ కల్చర్ ఆగిన అం శంపై పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతాం. ఆగిపోవడానికి కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తాం. కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించే క్రమంలో మొదటి ఏడాది మాత్రమే ప్రభుత్వం సబ్సిడీని అందజేసింది. తర్వాత మత్స్యకారులే నిర్వహించుకోవాలి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడ కొన సాగకపోవడానికి కారణాలను గుర్తిస్తాం. మత్స్యకారులకు మేలు చేయడానికే ప్రయత్ని స్తాం.
- రాణాప్రతాప్, అసిస్టెంట్ డైరెక్టర్, మత్స్యశాఖ, నారాయణపేట
Updated Date - 2022-10-18T04:25:56+05:30 IST