ఉపాధి పనులపై బహిరంగ విచారణ
ABN, First Publish Date - 2022-12-07T22:47:24+05:30
గద్వాల మండలంలో మూడేళ్ల పాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఎంపీపీ ఆల్వాల్ ప్రతాప్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధి పనుల లక్ష్యాన్ని వివరించారు.
- విధుల పట్ల నిర్లక్ష్యం బహిర్గతం
- ఆగ్రహం వ్యక్తం చేసిన డీఆర్డీఏ పీడీ నాగేంద్రం
- ముగ్గురు కార్యదర్శులు, ఇద్దరు టీఏలకు షోకాజ్ నోటీసులు
- హాజరుకాని ప్రజాప్రతినిధులు, కూలీలు
గద్వాల, డిసెంబరు 7 : గద్వాల మండలంలో మూడేళ్ల పాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఎంపీపీ ఆల్వాల్ ప్రతాప్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధి పనుల లక్ష్యాన్ని వివరించారు. అనంతరం డీఆర్డీఏ పీడీ నాగేంద్రం, ఎంపీడీవో రవీంద్ర ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కొనసాగింది. 2019-20, 2021, 2022 సంవత్సరాల్లో రూ.13.83 కోట్ల ఉపాధి పనులు నిర్వహించారని, వీటికి సంబంధించి వారం రోజుల పాటు తనిఖీలు, గ్రామ సభలు నిర్వహించినట్లు స్టేట్ రిసోర్స్ పర్సన్ అనిల్ కుమార్ వివరించారు. గ్రామాల వారీగా నమోదు చేసుకున్న వివరాలను ఆయన ముందు ఉంచారు. ఇందులో ప్రధానంగా పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో నిర్లక్ష్యం వల్ల అనుకున్న మేర లక్ష్యం నెరవేరలేదని తేలింది. డిమాండ్ పెట్టిన పనులు చూపించకపోవడం, పనులు లేనప్పుడు నో డిమాండ్ ఇవ్వకపోవడం, దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డులు ఇవ్వకపోవడం, అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఫలితంగా సర్వైవల్ రేటు తగ్గిపోవడం తదితర అంశాలను ఆడిట్ బృందం గుర్తించింది. రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, ఫొటోల నిర్వహణ చేయకపోవడం, కూలీలకు పే స్లిప్లు ఇవ్వకపోవడం వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ విధుల నిర్లక్ష్యంలో భాగంగా గుర్తించి ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెం ట్లకు డీఆర్డీఏ పీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో 15 మందికి రూ.25 వేలకుపైగా రికవరీ, జరిమానా విధించారు. కాగా ఆడిట్ నిర్వహణపై పలు విమర్శలు వచ్చాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రూ.13.83 కోట్ల పనులు జరిగినా, అవినీతిని బయట పెట్టలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కరోనా కారణంగా మూడేళ్లుగా ఆడిట్ నిలిచిపోయింది. గ్రామాల్లో రెండు, మూడేళ్ల కింద జరిగిన పనుల ఆనవాళ్లు ఆడిట్ బృందాలకు కనిపించకపోవడంతో, కూలీలతో మాట్లాడి నివేదికలను తయారు చేశారని తెలుస్తోంది. బహిరంగ విచారణకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. అదే విధంగా అభిప్రాయాలు చెప్పాల్సిన కూలీలు, రైతులు కూడా రాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. వారు నిర్వహించిన పనుల వివరాలను వారే చదువుకొని వెళ్లిపోయారన్న విమర్శ వ్యక్తమైంది.
Updated Date - 2022-12-07T22:47:25+05:30 IST