నడిగడ్డకు కూలీల వలస
ABN, First Publish Date - 2022-10-18T04:30:45+05:30
గతంలో నడిగడ్డకు చెందిన కూలీలు పొట్టకూటి కోసం రాయల సీమ, ఆంధ్ర ప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడ వ్యవ సాయ, భవననిర్మాణ పనులు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పనుల కోసం అక్కడి కూలీలు నడిగడ్డకు వస్తున్నారు.
- ఏపీ నుంచి వస్తున్న వందల మంది
- కర్నూల్ నుంచి ఆటోల్లో రాకపోకలు
- పత్తితీత, కలుపు పనులే లక్ష్యం
- స్థానిక కూలీలకు తగ్గిన డిమాండ్
అలంపూర్ చౌరస్తా, అక్టోబరు 17 : గతంలో నడిగడ్డకు చెందిన కూలీలు పొట్టకూటి కోసం రాయల సీమ, ఆంధ్ర ప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడ వ్యవ సాయ, భవననిర్మాణ పనులు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పనుల కోసం అక్కడి కూలీలు నడిగడ్డకు వస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం పరిసర గ్రామాలు, కర్నూల్ పట్టణంతో పాటు టీవీనగర్ కాలనీ, గొందిపర్ల, పంచలింగాల, ఉల్చాల, ఎన్టీఆర్ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, తాండ్రపాడు, మాసమసీదు, మునగాలపాడు, పెద్దపాడు, పర్లే, జీ. సింగవరం, అమడగుంట్ల, గోరంట్ల, ఈర్లదిన్నె, గార్లపాడు, పడమటి సింగవరం, ముడుమాల, పొలుకల్లు తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కూలీలు వస్తున్నారు. నిన్న మొన్నటి దాకా కలుపు తీతకు, ప్రస్తుతం పత్తితీత పనులు చేస్తు న్నారు. వారికి రోజు కూలీ మూడు వందలు కాగా, ఆటో చార్జీ రూ. 80 లుగా ఉంది. కేజీ పత్తి తీస్తే 15 నుంచి 20 రూపాయల వరకు ఇస్తున్నారు. స్థానికంగా పనులు లేకపోవడంతో ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నా మని వారు తెలిపారు.
పత్తి సాగు పెరగడమే కారణం
నడిగడ్డ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా పత్తి సాగు పెరిగింది. దీంతో కూలీల ఆవసరం పెరగడం, స్థానికంగా కొరత ఉండడంతో పొరుగు ప్రాంతాల నుంచి కూలీలను ఆటోలలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక రవాణాపై పలు అంక్షలు విధించింది. దీంతో భవన నిర్మాణాలపై ప్రభావం పడటంతో అక్కడ ఉపాధి కరువైంది. ఇసుక పనులపై ఆధారపడిన నదీ తీర గ్రామాలతో పాటు కర్నూల్ నగరంలో మధ్యతరగతి కుటుంబాల్లోని మగవారికి ఉపాధి కరువైంది. దీంతో మహిళలు తెలంగాణలో జోరుగా సాగే వ్యవసాయ పనులబాట పట్టారు. ప్రతీ ఏటా జులై నుంచి ఏప్రిల్ వరకు కలుపు, పత్తి తీత, మిర్చి కోత, మొక్క జొన్న విత్తటం, కోత తదితర పనులకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. అయితే కర్నూల్ ప్రాంతం నుంచి కూలీలు వస్తుండటంతో స్థానికంగా ఉండే వారికి డిమాండ్ తగ్గిందని ఇక్కడి రైతులు చెప్తున్నారు. అంతకుముందు వారికి బాగా డిమాండ్ ఉండేదని అంటున్నారు. మూడేళ్లుగా ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వస్తుండటంతో వ్యవసాయ పనులు సకాలంలో జరుగుతున్నాయని అభిప్రాయపడ్తున్నారు.
Updated Date - 2022-10-18T04:30:45+05:30 IST