భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T23:17:13+05:30
భారత్మాల భూ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- ‘భారత్మాల’పై అధికారులతో సమీక్ష
గద్వాల క్రైం, డిసెంబరు 15 : భారత్మాల భూ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ రహదారి కోసం భూ సేకరణ చేసిన కేటీదొడ్డి, గట్టు, ఆరగిద్ద, యాపదిన్నె, వెంకటాపురం, నందిన్నె, తప్పెట్లమొర్సు, అయిజ, జడదొడ్డి, బింగిదొడ్డి, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని గ్రామాల్లో సర్వేపనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రైతులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, వారు పొలాలకు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఇంకా చెల్లించాల్సిన డబ్బు వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్లు త్వరగా పనులు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఏవో యాదగిరి, ఈఈ ఖాజా, జుబేర్ ఆహ్మద్, రహిముద్దీన్, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. పొరపాట్లకు తావివ్వకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు రోజువారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేసి పంపించాలని ఆదేశించారు. ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో పేరు ఉండకుండా ఇంటింటికి తిరిగి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. చెక్లిస్టును రూపొందించుకొని బీఎల్వోలతో క్షేత్రస్ధాయి పరిశీలన జరిపించాలన్నారు. సరిగా లేని ఓటర్ల ఫొటోలను సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:17:14+05:30 IST