హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ABN, First Publish Date - 2022-10-18T04:27:26+05:30
కలుషిత అల్పాహారం వల్ల నారాయణపేట శాతవాహన కాలనీలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు 12 మంది సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
ఉప్మాలో పడిన బల్లి 8 12 మందికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స
వార్డెన్, వంట సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాల నాయకులు
నారాయణపేట టౌన్, అక్టోబరు 17: కలుషిత అల్పాహారం వల్ల నారాయణపేట శాతవాహన కాలనీలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు 12 మంది సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం కళాశాలకు వెళ్లే సమయంలో ఉప్మా పెట్టారు. శివ అనే విద్యార్థితో పాటు పలువురు ఉప్మా భుజించారు. శివకు అందులో బల్లి కనిపించింది. దానిని తోటి విద్యార్థులతో పాటు వంట వండిన వారికి చూపించారు. వంటవారు వెంటనే వండిన ఉప్మాను పారబోశారు. కొంత సమయం తర్వాత అల్పహారం తిన్న వారిలో శివతో పాటు శ్రీశైలం, భాస్కర్, చిన్నయ్య, కన్నయ్య, మహిపాల్, అనీల్, మహేష్, సాయి, శాంత కుమార్, శ్రీహరి, పవన్‌లకు వాంతులు అయ్యాయి. మరికొందరికి కడుపు నొప్పి వచ్చింది. వారిని చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై డాక్టర్ మహేష్‌ను వివరణ కోరగా చికిత్స అందిస్తున్నామని, ప్రమాదం ఏమీ లేదని అన్నారు. వార్డెన్ మసూద్ మాట్లాడుతూ అల్పాహారం రోజూ పరిశీలించి భోజనం తయారు చేయిస్తామని, ప్రమాదవశాత్తు బల్లి పడటాన్ని గమనించ లేదన్నారు. వంట వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమచారి వసతి గృహం వద్దకు వచ్చి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన వంట వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహానికి ఏబీవీపీ నాయకులు చేరుకొని సంఘటన గురించి విద్యార్థులతో ఆరా తీశారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన వార్డెన్, వంట వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వసతి గృహాలను పరిశీలించాలని కోరారు.
Updated Date - 2022-10-18T04:27:26+05:30 IST