ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలమూరులో గోవా మద్యం

ABN, First Publish Date - 2022-04-19T04:41:39+05:30

పాలమూరులో గోవా మద్యం ఏరులై పారుతోంది. పెద్ద మొత్తంలో మార్జిన్‌ తీసుకుని దానిని విక్రయిస్తున్నారు. ఈ దందా విలువ ప్రతీ నెల రూ.కోట్లల్లో ఉందంటే గోవా మద్యం ఏ మేర చేతులు మారుతుందో అర్థమతుంది.

అమిస్తాపూర్‌లో పట్టుకున్న గోవా మద్యం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతీ నెలా రూ.కోట్లల్లో వ్యాపారం

బాటిల్‌పై రూ.300 నుంచి రూ.1,000 వరకు లాభం

చక్రం తిప్పుతున్న ఓ ఎక్సైజ్‌ అధికారి డ్రైవర్‌

ఒక ఇంట్లో ఆఫ్‌ బాటిల్‌ పట్టుపడితే రూ.22 వేలు వసూలు


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 18: పాలమూరులో గోవా మద్యం ఏరులై పారుతోంది. పెద్ద మొత్తంలో మార్జిన్‌ తీసుకుని దానిని విక్రయిస్తున్నారు. ఈ దందా విలువ ప్రతీ నెల రూ.కోట్లల్లో ఉందంటే గోవా మద్యం ఏ మేర చేతులు మారుతుందో అర్థమతుంది. కొందరు ఎక్సైజ్‌శాఖ అధికారులు పరోక్ష సహకారం అందిస్తూ, తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. గోవా నుంచి మద్యం జిల్లాకు చేరాలంటే పలు చెక్‌పోస్ట్‌లు దాటించాలి. కొందరు చెక్‌పోస్ట్‌ లేని దారుల్లో మద్యాన్ని తీసుకొస్తుండగా, మరికొందరు చెక్‌పోస్ట్‌లలో మేనేజ్‌ చేసుకుని మద్యం దిగుమతి చేస్తున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో ప్యాసెంజర్‌ ముసుగులో మద్యాన్ని తరలిస్తున్నారు. మద్యం సరఫరా కోసం బస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పైపైన తనిఖీలు చేసి వదిలి పెడ్తుండటంతో గోవా మద్యం కొందరికి మంచి వ్యాపారంగా మారింది. ఒక్కో బాటిల్‌పై రూ.300-1000 వరకు అదనంగా తీసుకుంటున్నారు.


పెళ్ళింట్లో హల్‌చల్‌

భూత్పూర్‌ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల పెళ్ళి జరిగింది. ఆ ఇంట్లో గోవాకు చెందిన ఓ బాటిల్‌ ఉందన్న సమాచారంతో సదరు రింగ్‌ లీడర్‌, మరికొంతమందితో అక్కడికి వెళ్ళి పెళ్ళింట్లో నానా హంగామా చేశారు. ఇళ్ళంతా సోదాలు చేయగా రాయల్‌స్టాగ్‌ సగం బాటిల్‌ దొరికింది. ఇక రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఇంట్లో మగవాళ్ళపై దాడి చేసి, కేసు పెడతామంటూ బెదిరించాడు. పెళ్ళింట్లో కేసులు పెడితే పరువుపోతుందని భావించిన కుటుంబ సభ్యులు కాళ్ళవేళ్ళ పడి బతిమాలడంతో రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.22 వేలు తీసుకుని వెళ్ళారు. ఎవరికైనా సమాచారం ఇస్తే మీ సంగతి చూస్తామని బెదిరించారు. సగం బాటిల్‌ దొరికితే ఇంత హంగామా చేయడంపై పలువురు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. గోవాలో జిల్లాకు చెందిన పలువురు కులవృత్తులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు ఏడాదికోసారి ఇంటికి వస్తుంటారు. వచ్చేటపుడు ఇంట్లో పెద్దవాళ్ళకోసం ఒకటి రెండు బాటిళ్ళు తీసుకువస్తుంటారు. గ్రామాల్లో ఉండే కొందరు ఇన్‌ఫార్మర్లు ఈ విషయాన్ని ఎక్సైజ్‌ సిబ్బందికి చేరవేస్తుంటారు. 


136 బాటిళ్లు పట్టివేత

వారం కిందట అమిస్తాపూర్‌ గ్రామంలో గోవా మందు సరఫరా చేస్తున్న రెండు కార్లను ఎక్పైజ్‌ అధికారులు పట్టుకున్నారు. 136 బాటిళ్ళ(రాయల్‌స్టాగ్‌, రాయల్‌ ఛాలెంజ్‌)మద్యం సీజ్‌ చేసి, ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో గోవా మందు పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటన ఇదే. ఇదికూడా ఎక్సైజ్‌ సిబ్బంది ఇన్‌ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకే జరిగింది. ఒక బాటిల్‌ ఇంట్లో ఉంటేనే పక్కా సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్‌ సిబ్బంది.. ఇంత పెద్ద మొత్తంలో మద్యం సరఫరా చేసేవరకు ఎందుకు గమ్మున ఉన్నారన్న విమర్శలున్నాయి. అంటే దందా సాగిస్తున్న వారిలో వచ్చిన విభేదాల కారణంగా ఈ మద్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. గోవా నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో మద్యం వస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారో అధికారులకే తెలియాలి. ప్రతీ నెల జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, భూత్పూర్‌, కోయిలకొండ, జడ్చర్ల, నవాబ్‌పేట, గండీడ్‌, హన్వాడ, మిడ్జిల్‌ మండలాల్లో రూ.కోట్ల రూపాయల గోవా మద్యం వ్యాపారం సాగుతున్నా ఎక్కడా పట్టుకున్న దాఖలాలు లేవు.


సూత్రధారి అతడే..

జిల్లాలోని ఓ ఎక్సైజ్‌ అధికారికి చెందిన వాహన డ్రైవర్‌ గోవా మద్యం దందాకు రింగ్‌ లీడర్‌గా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు తెలిసే ఈ తంతు సాగుతుందన్న విమర్శలూ లేకపోలేదు. స్వయంగా ఈయనే ప్రైవేట్‌ బస్సులతో కుమ్మక్కై దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన బస్సుల ద్వారా మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ సరఫరా చేయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈయనే స్వయంగా బస్సుల్లో వెళ్ళి పెద్ద ఎత్తున మద్యం తీసుకొస్తూ, దారిలో చెక్‌పోస్ట్‌ల దగ్గర మేనేజ్‌ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇటీవల ఆయన జన్మదిన వేడుకలను ప్రైవేట్‌ బస్సు నిర్వాహకులు గోవాలో జరిపినట్లు తెలిసింది. నెల కిందట జిల్లాకు మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సును కర్ణాటక వద్ద తనిఖీలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యాన్ని సీజ్‌ చేశారు. సీజ్‌ అయిన మధ్యంలో సదరు రింగ్‌ లీడర్‌కు చెందిన మద్యంతో పాటు జిల్లా కేంద్రానికి చెందిన పలువురి మద్యం కూడా ఈ సీజ్‌ ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2022-04-19T04:41:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising