అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలి
ABN, First Publish Date - 2022-12-07T22:49:53+05:30
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలను గుర్తించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, డిసెంబరు 7 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలను గుర్తించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. గద్వాల, గోనుపాడు, క్యాతూర్‌లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మా ణం, లబ్ధిదారుల కేటాయింపులపై బుధవారం కలెక్టర్ చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు అర్హులైన నిరుపేదలను తహసీల్లార్లు, మునిసిపల్ కమిషనర్లు గుర్తించాలన్నారు. గోనుపాడు, క్యాతూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అర్హులైన జాబితాను సభలో ఉంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తహసీల్దార్లు, గ్రామపంచాయతీ పరిధిలో భూమి, ప్రభుత్వ ఉద్యోగం, ఫోర్‌వీలర్ లాంటి ఉన్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఇళ్లులేని వారు, పేదరికంలో ఉన్నవారిని గుర్తించి జాబితాను తయారు చేయాలన్నారు. రెవెన్యూ, మునిసిపాలిటీ, పంచాయతీల ఆధ్వర్యంలో పది టీములను ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. వీటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని, లాటరీ ద్వారా లబ్ధి దారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గద్వాలలో 560 ఇళ్లు పూర్తయ్యాయని, 715 ఇళ్లలో పనులు జరుగుతున్నాయని, 3,916 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిశీలించి అర్హులను వారిని గుర్తించి రెండు వారాల్లో జాబితా ఇవ్వాలన్నారు. గద్వాల ఇళ్ల జాబితా తయారీకి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. గోనుపాడులో నిర్మించిన ఇళ్లపై కొందరు అభ్యంతరం చెప్తున్నారని సర్పంచ్ కలెక్టర్‌కు తెలిపారు. ఆ ఇళ్లను 2019లో నిర్మించినందున కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతు చేయించి, ఆవరణను శుభ్రం చేసిన అనంతరం లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ రాజు, క్యాతూరు సర్పంచ్ సుశీలమ్మ, గోనుపాడు సర్పంచ్ మజీద్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T22:49:54+05:30 IST