ఆయకట్టు విస్తృతం
ABN, First Publish Date - 2022-12-16T23:12:42+05:30
వనపర్తి జిల్లా గతంతో పోలిస్తే.. సాగునీటి రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది.
- గణపసముద్రం, బుద్ధారం చెరువులు రిజర్వాయర్లుగా మార్పు
- సాంకేతిక కమిటీ పరిశీలన పూర్తి.. త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
- కల్వకుర్తి కింద ఎంజే-4 కాలువ ఖాన్ చెరువుకు అనుసంధానం
- రామన్నగట్టుకు అనుమతి వస్తే.. పూర్తి జనావాసాలకు సాగునీరు
- ఇప్పటికే భూగర్భజలాల పెరుగుదలలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం
వనపర్తి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా గతంతో పోలిస్తే.. సాగునీటి రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఓవైపు జూరాల, మరోవైపు భీమా.. ఇంకోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో ఆయకట్టు విస్తరణ వేగంగా జరిగింది. ఆరుతడి పంటలు తప్పా.. వరిసాగు పెద్దగా జరగని ప్రాంతంలో సాగునీరు అందడంతో 1.84లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వానాకాలంలో వరి సాగు చేశారు. ఇందులో వనపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 98లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇప్పటివరకు 216 జనావాసాలకు సాగునీరు అందుతుండగా.. ప్రస్తుతం చేపట్టిన.. చేపట్టబోతున్న పనులు పూర్తయితే.. నియోజకవర్గంలోని పూర్తి జనావాసాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కాగా.. కొన్ని టెండర్ల దశలో.. మరికొన్ని అనుమతుల దశలో ఉన్నాయి. సాగునీటి వనరుల పెరుగుదల వల్ల వనపర్తి జిల్లా ప్రస్తుతం భూగర్భజలాల పెరుగుదల లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండగా.. భవిష్యత్‌లో కూడా ఇదే స్థానం ఉండేందుకు మరికొన్ని పను లు చేపట్టబోతున్నారు. ఖిల్లాఘణ పురం మండలంలోని అత్యం త ఎత్తులో ఉన్న కర్నె తండా.. చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందించేందుకు గత మార్చిలో సీఎం కేసీఆర్ సుమారు రూ. 72కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ లిఫ్టు పూర్తయితే.. ఖిల్లాఘణపురం మండలంలో సాగునీరు అందని గ్రామాలే ఉండవు.
రూ. 92కోట్లతో రిజర్వాయర్లుగా మార్పు..
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని గణప సముద్రం, గోపాల్పేట మండలంలోని బుద్ధారం పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా మారబోతున్నాయి. గణపసముద్రం చెరువు వనపర్తి జిల్లాలోని సప్త సముద్రాల్లో ఒకటి.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాభవం కోల్పోయింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద చెరువును అనుసంధానించిన తర్వాత ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారింది. ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చడం వల్ల సుమారు 10వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు స్థిరంగా సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు రూ. 47 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్‌గా మార్చేందుకు జీఓ కూడా వచ్చింది. గోపాల్పేట మండలంలోని బుద్ధారం పెద్ద చెరువును ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అనుసందానం చేశారు. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుండటంతో వరిసాగు బాగా పెరిగింది. త్వరలో దీన్ని కూడా రిజర్వాయర్‌గా మార్చబోతున్నారు. సుమారు రూ. 45కోట్ల అంచనా వ్యయంతో జీవో విడుదల చేశారు. ప్రస్తుతం సాంకేతిక కమిటీ పరిశీలన పూర్తికాగా.. రెండు చెరువులకు సంబంధించి రిజర్వాయర్లుగా మార్చడానికి త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి.. రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ సలహాదారు విజయ్ ప్రకాశ్ ఈ రెండు చెరువులను పరిశీలించారు. ఒక్కసారి ఈ చెరువులు రెండు రిజర్వాయర్లుగా మారితే ఖిల్లాఘణపురం, గోపాల్పేట, పెద్దమందడి, వనపర్తి మండలాల్లో సాగునీటికి ఇబ్బందులు ఎదురుకావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపాదనల దశలో రామన్నగట్టు...:
వనపర్తి మండలంలో మిట్ట ప్రాంతాలుగా ఉన్న సవాయిగూడెం, పెద్దగూడెం, దత్తాయిపల్లి, కిష్టగిరి పాన్‌గల్ మండలం దావాజిపల్లి గ్రామాలకు సాగునీరు అందించడం కోసం గతంలోనే రూ. 18.66 కోట్లతో 9.350 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి.. ప్యాకేజీ 29లో భాగంగా జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ పనులు పూర్తయితే నీళ్లు పెద్దగూడెంలోని ఖాన్ చెరువుకు వస్తాయి. దీని ద్వారా సుమారు అయిదు గ్రామాలకు శాశ్వతంగా సాగునీరు అందుతుంది. ఇక వనపర్తి మండలంలో అత్యంత ఎత్తులో ఉన్న ఖాసీంనగర్, ఎర్రగట్టు తండా, నాగమ్మ తండాల పొలాలకు సాగునీరును అందించేందుకు ఇప్పటికే మినీ లిఫ్టులను ఏర్పాటు చేసినప్పటికీ.. శాశ్వతంగా సమస్య తీరేందుకు రేమద్దుల సమీపంలో రామన్నగట్టు వద్ద రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. 0.5 టీఎంసీల సామర్థ్యంతో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించడం కోసం ప్రస్తుతం ఫైలు సీఎం కేసీఆర్ వద్ద ఉండగా.. వారం పదిరోజుల్లో జీఓ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రామన్నగట్టు రిజర్వాయర్ కూడా పూర్తయితే వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సాగునీరు అందించడం పూర్తికానుంది. ఇప్పటికే 16 చెక్‌డ్యాంలు వనపర్తి నియోజకవర్గానికి మంజూరు కాగా.. అందులో రెండు మినహా 14 చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. వాగుల వెంట నీరు నిలిచి ఉండటం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. వాగుల ఆధారంగా రైతులు మోటార్లతో సాగునీటిని తీసుకుంటున్నారు.
Updated Date - 2022-12-16T23:12:43+05:30 IST