ఎంసీహెచ్‌పై దాడి
ABN, First Publish Date - 2022-12-31T22:52:31+05:30
భార్యకు అబార్షన్ కావడంతో ఆమె భర్త ఎంసీహెచ్(మాతా శిశు ఆరోగ్య కేంద్రం) కేంద్రంపై దాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలోని అద్దాలను ధ్వంసం చేసి, టేబుల్‌ను విరగొట్టాడు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డాక్టర్లను దుర్భాషలాడాడు.
భార్యకు అబార్షన్ కావడంతో భర్త వీరంగం
ఆస్పత్రిలో అద్దాలు, టేబుల్ ధ్వంసం
వనపర్తి వైద్యవిభాగం, డిసెంబరు 31: భార్యకు అబార్షన్ కావడంతో ఆమె భర్త ఎంసీహెచ్(మాతా శిశు ఆరోగ్య కేంద్రం) కేంద్రంపై దాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలోని అద్దాలను ధ్వంసం చేసి, టేబుల్‌ను విరగొట్టాడు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డాక్టర్లను దుర్భాషలాడాడు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని నర్సింగాయపల్లి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్ల వివరాల ప్రకారం.. గోపాల్పేట మండలం, తాడిపర్తి గ్రామానికి చెందిన హేమలత ఆరు నెలల గర్భిణి. శనివారం ఆమెకు విరేచనాలు అయ్యాయి. దాంతో ఆరోగ్యం నీరసించింది. రెండు గంటల వ్యవధిలో ఐదారు సార్లు విరేచనాలు కావడంతో అధిక రక్తస్రావం అయ్యింది. కుటుంబ సభ్యులు ఆమెను గోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి ఇబ్బందిగా మారడంతో గోపాల్పేట పీహెచ్సీ సిబ్బంది ఆమెను నర్సింగాయపల్లి వద్ద ఉన్న ఎంసీహెచ్ కేంద్రానికి రెఫర్ చేశారు. ఎంసీహెచ్ కేంద్రానికి చేరుకునే లోపే పిండం చేయి బయటికి వచ్చింది. దాంతో డాక్టర్లు పరీక్షించి బిడ్డ మృతి చెందిందని, ఆమెకు అబార్షన్ చేయాలని చెప్పి చేశారు. దీంతో కోపొద్రిక్తుడైన ఆమె భర్త శివాజి డాక్టర్లు కావాలనే తనకు పుట్టబోయే బిడ్డను తొలగించారని, తన భార్యను కూడా తనకు దక్కకుండా చేస్తారని వీరంగం సృష్టించాడు. ఆస్పత్రిలో అద్దాలను, టేబుల్‌ను విరగొట్టాడు. అడ్డువచ్చిన వారిని తోసేస్తూ పరుష పదజాలంతో దూషించాడు. భయపడిన వైద్య సిబ్బంది ఆర్ఎంవో డాక్టర్ రాజశేఖర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన ఎంసీహెచ్ కేంద్రానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే శివాజి ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు విధుల్లో ఉన్న గైనకాలజిస్టు డాక్టర్ ప్రతిమ, గర్భిణి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన తమ్ముడికి మతిస్థిమితం తప్పడంతో అలా ప్రవర్తించాడని, ఆస్పత్రిలో జరిగిన డ్యామేజ్‌ను సరి చేస్తామని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు.
Updated Date - 2022-12-31T22:52:32+05:30 IST