రంగస్థల దర్శకుడు తల్లావజ్ఝల సుందరం ఇక లేరు
ABN, First Publish Date - 2022-03-22T09:34:55+05:30
ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, రచయిత తల్లావజ్ఘల సుందరం (72) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం చిక్కడపల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సుందరానికి ప్రఖ్యాత హాస్య
హైదరాబాద్ సిటీ, మార్చి21 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు, రచయిత తల్లావజ్ఘల సుందరం (72) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం చిక్కడపల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. సుందరానికి ప్రఖ్యాత హాస్య రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి మాతామహుడు అయితే, భావకవితోద్యమ స్రష్ట తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి పితామహుడు. సుందరం స్వస్థలం ఒంగోలు. తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏ చేశారు. నాటక రంగంపై మక్కువతో సినిమా అవకాశాలను తిరస్కరించిన సుందరం రంగస్థలానికే అంకితమయ్యారు. తెలుగు నాటకాన్ని మూస ధోరణి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వాళ్లలో తల్లావజ్ఝల ఒకరు.
సినీ నటులు కోటా శ్రీనివాసరావు, రాళ్లపల్లి, తనికెళ్ల భరణి తదితరులతో కలిసి కొన్ని వందల నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సినీనటుడు భరణి రాసిన ‘కొక్కొరొకో’, ‘గోగ్రహణం’, ‘జంభూద్వీపం’, ‘గార్థభాండం’ తో పాటు ‘సూదిలోంచి ఏనుగు’, మహాభారతంలోని ఒక ఘటన ఆధారంగా రాసిన ‘మాధవి’ తదితర నాటకాలకు సుందరం దర్శకత్వం వహించారు. సుందరం రాసిన ‘ఉదయాగమము’ తెలుగు నవలాలోకంలో ఒక సంచలనం. సుందరం కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉన్నారు. వారి కోసం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలోని మార్చురీలో భద్రపరిచారు. మార్చి 24న అంత్యక్రియలు నిర్వహిస్తామని సుందరం సోదరులు ప్రముఖ రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, శివాజీ, లలితా ప్రసాద్ తెలిపారు. సుందరం మరణం నాటకరంగానికి తీరని లోటని తనికెళ్ల భరణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రంగస్థల రచయిత బ్నీం తదితరులు విచారం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-03-22T09:34:55+05:30 IST