కొత్తకొండకు పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2022-01-17T06:18:26+05:30
కొత్తకొండకు పోటెత్తిన భక్తులు
ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్యలకు స్వాగతం పలుకుతున్న అర్చకులు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన
కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు.. వేలేరు మేకల బండ్లు
కిటకిటలాడిన కొత్తకొండ వీధులు
భీమదేవరపల్లి, జనవరి 16 : కొత్తకొండ... భక్తజన జాతరగా మారింది. ఎటు చూసినా క్యూ లైన్లతో భక్తులు కిక్కిరిసిపోయారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారికి కోరమీసాలు, గుమ్మడికాయలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో కొత్తకొండ జాతర ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి పారవశ్యంతో ఊగిపోయింది. వీరభద్రుడి నామస్మరణతో భక్తులు ఉప్పొంగిపోయారు. శనివారం మకర సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగలో జాతర సందర్భంగా సుమారు లక్షలాది మంది భక్తులు హాజరైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్‌లు ఎడ్లబండి నడుపుకుంటూ వచ్చి స్వామి వారికి గుమ్మడికాయ మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో వెంకన్న పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ముల్కనూర్ ఏకేవీఆర్ కళాశాలకు చెందిన 50 మంది ఎన్‌ఎ్‌సఎస్ వలంటీర్లు జాతరలో విశిష్ట సేవలందించారు.
హనుమకొండ, వరంగల్, సిద్ధిపేట, కరీంనగర్, జనగామ, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడపడం, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఇష్టమైన గుమ్మడికాయలు, కోరమీసాలు సమర్పించారు. ఈ నెల 15న శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరిగాయి. ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు సురేష్, నవిత, పరమేశ్వర్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు జాతరలో బందోబస్తు నిర్వహించారు. జాతరను విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు అధికారులు తిరిగి తమ విధుల్లోకి చేరేందుకు వెళ్లారు.
లక్షలాది మంది భక్తుల మొక్కులు
కొత్తకొండ దేవాలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని శని, ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. మకర సంక్రాంతి, కనుమ పండగ రోజుల్లో భక్తులతో ఆలయం మొత్తం కిటకిటలాడగా క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తండోప తండాలుగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రత్యేక ఆకర ్షణగా ఎడ్లబండ్ల రథాలు
కొత్తకొండ జాతరకే కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్తపల్లి గ్రామం నుంచి 65 ఎడ్లబండ్లను అందమైన రథాలుగా తీర్చిదిద్ది ఆలయం చుట్టూ తిప్పారు. రైతులు గత మూడు రోజులుగా కష్టపడి తమ ఎడ్లబండ్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది జాతరకు తీసుకొచ్చారు. 65 ఎండ్లబండ్ల రథాలను శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆల యం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఇంటికి వెళ్లిపోయాయి. అందమైన ఎడ్లబండ్లను చూసేందుకు జాతరకు వచ్చిన భక్తులు ఆసక్తిగా చూశారు. వేలేరు గ్రామం నుంచి వచ్చిన మేకల బండ్లు పలువుర్ని ఆకట్టుకున్నాయి. శనివారం అర్థరాత్రి మేకల బండ్లు రావడంతో ఆలయ అధికారులు వాటిని ఆలయం ముందుకు తీసుకువచ్చారు. ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, జాతర చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వీరస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తకొండ జాతరలో 18వేల పండ్ల మొక్కలను పంపిణీ చేసినట్లు వృక్షప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మామిడి, దానిమ్మ, సపోట, జామ, నిమ్మ తదితర పండ్ల మొక్కలను భక్తులకు అందజేశామన్నారు.
Updated Date - 2022-01-17T06:18:26+05:30 IST